పద్మావత్ సినిమాకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్ని రాష్ట్రాల్లో విడుదల చేసుకోవచ్చని ఆదేశించింది. రాజస్థాన్, గుజరాత్, హర్యానా, మధ్య ప్రదేశ్ ప్రభుత్వాలు విధించిన నిషేధం చెల్లదని కోర్టు తెలిపింది. అంతేగాక నిషేధాన్ని తప్పుపట్టిన కోర్టు.. నిరసనకారులపై మండిపడింది. దీంతో జనవరి 25న ఈ సినిమా విడుదలకానున్న నేపథ్యంలో అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. సీబీఎఫ్‌సీ కొన్ని షరతులతో సినిమా రిలీజ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా.. బీజేపీ పాలిత రాష్ర్టాలైన రాజస్థాన్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్ సినిమాపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.
దీంతో సినిమా నిర్మాతలు సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై ఇవాళ విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. సినిమాపై నిషేధం విధించే హక్కు ఎవరికీ లేదని తేల్చి చెప్పింది. అన్ని రాష్ర్టాలు సినిమా రిలీజ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణ, దర్శకత్వంలో సినిమా రూపొందింది. దీపికాపదుకునే, షాహిద్ కపూర్, రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు.