యూపీ సర్కార్‌కి రూ.10 లక్షల జరిమానా!

2
- Advertisement -

సంభాల్ హింసాత్మక ఘటన కేసులోని ప్రధాన నిందితుడిపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జాతీయ భద్రతా చట్టం (NSA) కింద విధించిన నిరోధక నిర్బంధాన్ని (Preventive Detention) సుప్రీంకోర్టు మంగళవారం రద్దు చేసింది. పోలీసు కస్టడీలో ఇచ్చిన ఒప్పుకోలు వాంగ్మూలం ప్రాతిపదికగా ఒక వ్యక్తిని NSA కింద నిర్బంధించలేరని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

అక్రమ నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసినందుకు గాను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ₹10 లక్షల జరిమానా విధించింది. జస్టిస్ దీపాంకర్ దత్తా మరియు జస్టిస్ షీల్ నాగులతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. పోలీసు కస్టడీలో నిందితుడు ఇచ్చినట్లు చెబుతున్న వాంగ్మూలం ఆధారంగా యూపీ ప్రభుత్వం నిరోధక నిర్బంధ ఉత్తర్వులను జారీ చేసి ఉండకూడదని ధర్మాసనం పేర్కొంది.

నవంబర్ 2024లో ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లోని షాహి జమా మసీదు సర్వే సందర్భంగా జరిగిన హింసాకాండకు ముల్లా అఫ్రోజ్ ప్రధాన సూత్రధారి అని ఆరోపణలు ఉన్నాయి. అలహాబాద్ హైకోర్టు నుంచి బెయిల్ పొందిన కొద్దిరోజులకే, అక్టోబర్ 2025లో యూపీ ప్రభుత్వం ఆయనను మళ్లీ అరెస్టు చేసి NSA ప్రయోగించింది.

విచారణ సందర్భంగా యూపీ ప్రభుత్వ చర్యలను కోర్టు తీవ్రంగా ప్రశ్నించింది. అఫ్రోజ్ విడుదలైతే ప్రాంతంలో మళ్లీ హింస చెలరేగే ప్రమాదం ఉందని, శాంతిభద్రతలను కాపాడేందుకు ఈ నిర్బంధం అవసరమని యూపీ ప్రభుత్వం వాదించింది. కానీ, కోర్టులో సాక్ష్యంగా చెల్లని పోలీసు కస్టడీ వాంగ్మూలాన్ని NSA నిర్బంధానికి ప్రాతిపదికగా ఎలా తీసుకుంటారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అఫ్రోజ్ నిర్బంధాన్ని సమర్థించిన అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Also Read:సిరిసిల్ల క్రికెటర్‌ అక్షరకు కేటీఆర్ అండ

ఈ తీర్పును వెలువరించే సమయంలో ఒక అరుదైన, తీవ్ర భావోద్వేగపూరిత సంఘటన చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో కీలకమైన రీసెర్చ్ సాయం అందించిన తన లా క్లర్క్ రిత్విక్ దేశ్‌వాల్ (27 ఏళ్లు రాకుండానే ఇటీవల కన్నుమూశారు) జ్ఞాపకార్థం జస్టిస్ దీపాంకర్ దత్తా ఈ తీర్పును ఆయనకు అంకితం చేశారు.సుప్రీంకోర్టు చరిత్రలోనే ఒక ధర్మాసనానికి సహకరించి అకస్మాత్తుగా మరణించిన లా క్లర్క్‌కు తీర్పును అంకితం చేయడం ఇదే తొలిసారి. రిత్విక్ అందించిన పరిశోధన ఈ తీర్పులో చెరగని ముద్రగా నిలిచిందని, ఆయన లేని లోటు తీర్చలేనిదని జస్టిస్ దత్తా భావోద్వేగానికి లోనయ్యారు.

- Advertisement -