నగరం నలువైపులా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్..

257
minister prashanth reddy
- Advertisement -

వైద్యం విషయంలో హైదరాబాద్‌ నగరంలోని పేద ప్రజలు మరియు చుట్టుప్రక్కల జిల్లాలలోని ప్రజలు ఇబ్బంది పడకూడదన్న దృష్టితో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హైదరాబాద్‌ నగరానికి నలువైపులా 4 సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు మంజూరు చేశారని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలో టీమ్స్‌ ను కోవిడ్ సమయంలో ఏర్పాటు చేశారని, మిగితావి సనత్ నగర్ ఏరియాలోని చెస్ట్ హాస్పిటల్ ఆవరణలో 62 ఎకరాల్లో, ఆల్వాల్‌ లో బొల్లారం ఏరియాలో 28 ఎకరాల్లో, మూడవది గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ ప్రాంగణంలో 28 ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

మంగళవారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి క్షేత్రస్థాయిలో నిర్మాణ స్థలాలను నగర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో కలిసి పరిశీలించారు.ఛాతి ఆసుపత్రి మరియు ఆల్వాల్‌ లోని భారతీయ విద్య భవన్,గడ్డిఅన్నారంలోని ఫ్రూట్ మార్కెట్ ప్రాంగణాన్ని సందర్శించారు. వీరు అక్కడి పరిస్థితులను పరిశీలించి త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు.ఈ ఆసుపత్రుల నిర్మాణాన్ని ఆర్‌ బి శాఖకు ఇచ్చి వాటి నిర్మాణాన్ని చేపట్టవలసినదిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని మంత్రి తెలిపారు.

హైదరాబాద్‌ చుట్టుప్రక్కల ఉన్న జిల్లాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈస్ట్, వెస్ట్,నార్త్,సౌత్ ఇలా నగరంలో కోటి పైచిలుకు జనాభా ఉన్నదని దాంతో పాటు చుట్టూ మెదక్,రంగారెడ్డి,నల్గొండ పరిసర ఇతర జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి అన్నారు.పేద ప్రజలకు అందుబాటులో..వారి ఇబ్బందులును తెలుసుకొని అత్యధునాతన సౌకర్యాలతో మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మిస్తున్నారని తెలిపారు.పెరుగుతున్న జనాభా అవసరాలకనుగుణంగా ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్ ప్రాంగణంలో ఉన్న వారికి ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. నగర ప్రజల తరుపున మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ముఖ్యమంత్రికి కృతఙ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌,కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న,ఎల్.బి నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి,ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, దయానంద్, పలువురు అధికారులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -