తెలంగాణలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్‌..

60
Congress
- Advertisement -

తెలంగాణ‌లో మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తాం, టీఆర్ఎస్ ను ఓడించి తీరుతాం, పాద‌యాత్ర‌ల‌తో… డిక్లరేష‌న్ల‌తో ఇక జ‌నం మ‌ధ్య‌నే రాహుల్ గాంధీ చెప్పిన‌ట్లే చేస్తాం అంటూ గొప్ప‌లు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి నేత‌ల‌కు షాకిచ్చే వార్త ఇది. ఇంటి పోరు ఏ రేంజ్ లో ఉందో చెప్తూ వ్యూహాక‌ర్త సునీల్ క‌నుగోలు టీం ఇచ్చిన రిపోర్టు ఇప్పుడు కాంగ్రెస్ పెద్ద‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌తో పాటు ఏఐసీసీకి ప‌నిచేసేందుకు గ‌తంలో పీకేతో క‌లిసి ప‌నిచేసిన సునీల్ క‌నుగోలును రాహుల్ గాంధీ నియ‌మించారు. రెండు మూడు నెల‌లుగా ప‌ని ప్రారంభించిన సునీల్ టీం గ్రౌండ్ లో ప‌రిస్థితుల‌పై ఓ అంచ‌నాకు వ‌చ్చింద‌ని… కాంగ్రెస్ కు ఉన్న ప్ర‌ధాన స‌మ‌స్య ఆ పార్టీ లీడ‌ర్లేన‌ని తేల్చి చెప్పిన‌ట్లు స‌మాచారం.

కాంగ్రెస్ లో ఉన్న బ‌డా నేత‌ల మ‌ధ్య క‌నీస స‌మ‌న్వ‌యం కూడా లేద‌ని… ఎవ‌రికి వారే గ్రూపుల‌తో ఈగోల‌తో ఉంటార‌ని, పార్టీ కార్య‌క్ర‌మం క‌దా అని కూడా ఆలోచించ‌కుండా సొంత మైలేజ్‌తో పాటు ప్ర‌త్య‌ర్థి వ‌ర్గాన్ని తొక్కామా లేదా అన్న ఆలోచ‌నే ఉంటుంద‌ని ఆ రిపోర్ట్‌లో పేర్కొన్న‌ట్లు తెలుస్తోంది. పెద్ద నేత‌ల మ‌ధ్య పోరే కాదు జిల్లా స్థాయిల్లోనూ అనేక గ్రూపులున్నాయ‌ని… ఈ గ్రూపుల పంచాయితీతోనే కాంగ్రెస్ మూటా ముళ్లే స‌ర్ధుకోవాల్సి వ‌స్తుందని ఆ రిపోర్ట్ సారాంశ‌మ‌ని గాంధీ భ‌వ‌న్ వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఈ కార‌ణంగానే నేత‌లెవ‌రూ కిందిస్థాయి కార్య‌క‌ర్త‌ల‌తో స‌రిగ్గా ట‌చ్ లో లేర‌ని, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోకుండా… హైద‌రాబాద్ కు ప‌రిమితం అయ్యార‌ని రిపోర్టులో పేర్కొన్నారు.

కొంద‌రు నేత‌ల‌యితే ఎన్నిక‌ల‌ప్పుడు వెళ్లొచ్చులే అని నియోజ‌క‌వ‌ర్గం వైపు కూడా క‌న్నేత్తి చూడ‌కుండా సొంత బిజినెస్ లు చ‌క్క‌పెట్టుకుంటున్నార‌ని, మ‌రికొంద‌రు నేత‌లు టీఆర్ఎస్ తో స‌ఖ్య‌త‌తో ఉంటూ కావాల్సిన ప‌నులు చేయించుకుంటూ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీకి గుదిబండ‌గా మారార‌ని… ఇవ‌న్నింటిపై తీరు మార్చుకోకుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఎవ‌రెంత క‌ష్ట‌ప‌డ్డ ఫ‌లితం శూన్య‌మేన‌ని సునీల్ త‌న రిపోర్టులో పేర్కొన్న‌ట్లు స‌మాచారం.

- Advertisement -