సుందిళ్లకు జల కళ..

620
sundhilla
- Advertisement -

కాళేశ్వర గంగా వాయువేగంతో పరుగులు తీస్తోంది. ప్రాణహిత నుంచి గోదావరినదిలోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో పెద్దపల్లి జిల్లా మంథనిలోని అన్నారం పంప్ హౌస్ మూడో మోటర్ ను ప్రారంభించారు. అన్నారం పంపుహౌస్ నుంచి సుందీళ్ల బ్యారేజ్ లోకి ఇప్పటి వరకు ఒక టీఎంసీ నీరు చేరుకుంది. అటు కన్నెపల్లి పంపు హౌస్ నుంచి 5 మోటర్లతో నీటిని ఎత్తి పోస్తున్నారు. దీంతో నిరంతరాయంగా ఐదు మోటర్లు నీటిని ఎత్తిపోస్తున్న దృశ్యం కనువిందు చేస్తున్నది.

కన్నెపల్లిలోని మోటర్లు ఒక్కొక్కటి రోజుకు 2,100 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నాయి. ఈ ఐదు మోటర్లు నిరంతరం పనిచేయడంతో 10,500 క్యూసెక్కుల నీరు గ్రావిటీ కెనాల్ ద్వారా అన్నారం బ్యారేజ్‌కి చేరిందని, నీటినిల్వ 7.20 టీఎంసీలకు ఉన్నదని ఇంజినీర్లు తెలిపారు. ప్రాణహిత నుంచి గోదావరిలోకి ప్రవాహం నిలకడగా ఉండటంతో మేడిగడ్డలోని గేట్లన్నీ మూసివేశారు. ప్రస్తుతం మేడిగడ్డలో నీటినిల్వ 7.10 టీఎంసీలకు చేరింది.

ప్రస్తుతం అన్నారం పంపు హౌస్‌లోని ఒకటో నంబర్ మోటర్ తో నీటిని ఎత్తిపోస్తుండగా, నిన్న రెండో నంబర్ మోటర్ను ఆరుగంటలపాటు నడిపారు. దీంతో 130 ఎఫ్ఆర్ఎల్ సామర్థ్యం కలిగిన సుందిళ్ల బ్యారేజ్‌లోకి సాయంత్రం వరకు 120.05 మీటర్లకు నీటిమట్టం పెరిగింది. సుందిల్ల బ్యారేజ్‌ నుంచి గోలివాడ పంపు హౌస్‌ దాకా గోదావరి 27 కిలోమీటర్ల పొడవు ఉండగా, ఇప్పటికే గోదావరి జలాలు 8.5 కిలోమీటర్ల దూరం ఎగబాకాయి. అన్నారం పంపుహౌస్‌లో మూడో నంబర్ మోటర్ వెట్ రన్‌కు సమాయత్తం అవుతున్నట్టు అధికారులు తెలిపారు.

- Advertisement -