సడన్‌గా పంటి నొప్పి వస్తే ఏం చేయాలి?

2
- Advertisement -

పంటి నొప్పి ఎప్పుడు వస్తుందో చెప్పలేం. ఒక్కసారిగా మొదలయ్యే తీవ్రమైన నొప్పి తినడానికి, తాగడానికి ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యంగా వేడి లేదా చల్లటి పదార్థాలు తీసుకున్నప్పుడు నొప్పి మరింత ఎక్కువ కావచ్చు. ఇలాంటి సమయంలో వెంటనే దంత వైద్యుడిని సంప్రదించే అవకాశం లేకపోతే తాత్కాలికంగా నొప్పి తగ్గించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటించవచ్చు. అయితే పంటి నొప్పికి అసలు కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం.

దంత క్షయం పంటి నొప్పికి ప్రధాన కారణాల్లో ఒకటి. పంటిలోని లోపలి భాగమైన పల్ప్‌ వరకు ఇన్ఫెక్షన్ చేరితే తీవ్రమైన నొప్పి వస్తుంది. అలాగే పల్ప్‌లో వాపు , పంటికి పగుళ్లు ఏర్పడటం, దంతాల మధ్య ఆహార పదార్థాలు ఇరుక్కుపోవడం, చిగుళ్ల వాపు, దంతాల వేర్లు బయటపడటం కూడా నొప్పికి కారణమవుతాయి.

కొన్నిసార్లు పంటి చుట్టూ లేదా చిగుళ్లలో చీము చేరడం (Dental Abscess) వల్ల కూడా తీవ్రమైన నొప్పి వస్తుంది. జ్ఞానదంతాలు బయటకు వస్తున్నప్పుడు, సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా పై దవడ పళ్లలో నొప్పి అనిపించవచ్చు.

పంటి నొప్పి మొదలైతే వెంటనే ఏం చేయాలి?

ముందుగా గోరువెచ్చని నీటితో నోటిని మెల్లగా పుక్కిలించాలి. దీనివల్ల పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహార పదార్థాలు తొలగిపోతాయి.

పళ్ల మధ్య ఆహారం ఇరుక్కుంటే డెంటల్ ఫ్లాస్‌తో జాగ్రత్తగా శుభ్రం చేయాలి. చిగుళ్లపై ఒత్తిడి పెట్టకూడదు.

వేడి లేదా చల్లటి పదార్థాలు తిన్నప్పుడు నొప్పి వస్తుందా? నమిలేటప్పుడు ఎక్కువవుతుందా? లేక ఎలాంటి కారణం లేకుండానే నొప్పి కొనసాగుతోందా? అనే విషయాలను గమనించాలి.

నొప్పి తీవ్రంగా ఉన్నా, పదేపదే వస్తున్నా లేదా తినడానికి, నిద్రపోవడానికి ఇబ్బంది కలిగిస్తున్నా వెంటనే దంత వైద్యుడిని సంప్రదించాలి.

Also Read:అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ పాదయాత్ర

ఇంట్లో తాత్కాలికంగా నొప్పి తగ్గించుకునే మార్గాలు

ఉప్పు నీటితో పుక్కిలించడం: ఒక కప్పు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పు కలిపి నోటిని పుక్కిలించాలి. ఆ తర్వాత నీటిని ఉమ్మివేయాలి. మింగకూడదు.

కోల్డ్ కంప్రెస్: పంటి నొప్పితో పాటు ముఖం లేదా చిగుళ్ల దగ్గర వాపు ఉంటే శుభ్రమైన వస్త్రంలో చుట్టిన చల్లటి ప్యాక్‌ను చెంపపై 10-15 నిమిషాల పాటు ఉంచవచ్చు.

- Advertisement -