నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ యుద్ధం ప్రకటించారు. ఈ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాల రాజకీయ హక్కులు కాలరాయబడతాయని ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆయన వినూత్నంగా మరియు ఘాటుగా నిరసన తెలిపారు.
చెన్నైలో జరిగిన ఈ నిరసనలో భాగంగా ముఖ్యమంత్రి స్టాలిన్ స్వయంగా నల్ల జెండాను ఎగురవేశారు. ఇది కేవలం ఒక రాష్ట్ర నిరసన మాత్రమే కాదని, దక్షిణాది ఆత్మగౌరవ పోరాటమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలను శిక్షించేలా ఉన్న ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించబోమని ఆయన స్పష్టం చేశారు.
నిరసన కార్యక్రమంలో భాగంగా స్టాలిన్ డీలిమిటేషన్ బిల్లు ప్రతులను (Copies) బహిరంగంగా దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రానికి బలమైన హెచ్చరిక జారీ చేశారు.గతంలో తమిళనాడులో హిందీ రుద్దుడుకు వ్యతిరేకంగా మేము చేపట్టిన ప్రతిఘటన జ్వాల ఢిల్లీని దహించివేసింది. ఇప్పుడు ఈ బిల్లు ప్రతిని తగలబెట్టడం ద్వారా నేను మరో జ్వాలను రగిలించాను. మా హక్కులను కాపాడుకోవడానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధం అని తెలిపారు.
జనాభా ప్రాతిపదికన సీట్లను పెంచడం వల్ల ఉత్తరాది రాష్ట్రాలకు లాభం చేకూరి, దక్షిణాది రాష్ట్రాల గళం లోక్‌సభలో బలహీనపడుతుందని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, ప్రగతి సాధించిన రాష్ట్రాలకు అన్యాయం చేయడమేనని ఆయన విమర్శించారు. స్టాలిన్ రగిలించిన ఈ నిరసన జ్వాల ఇప్పుడు ఇతర దక్షిణాది రాష్ట్రాలకు కూడా పాకే అవకాశం కనిపిస్తోంది.
ALso Read:దక్షిణాదికి అన్యాయం జరగకూడదు:గుత్తా

