నిన్న ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన తరుణంలో, ఒక వింతైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఫలితాల టెన్షన్‌తో ఒక విద్యార్థి ఏకంగా ఇంటర్ బోర్డు అధికారులకే ఫోన్ చేసి చేసిన విన్నపం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాధారణంగా పరీక్షా ఫలితాలు వస్తున్నాయంటే విద్యార్థుల్లో భయం ఉండటం సహజం. కానీ విశాఖపట్నంకు చెందిన ఒక ఇంటర్ సెకండియర్ విద్యార్థి మాత్రం ఆ భయంతో ఏకంగా బోర్డు అధికారులకే ఫోన్ చేసి తన గోడు వెళ్లబోసుకున్నాడు. బుధవారం ఫలితాలు విడుదల కావడానికి కొద్ది గంటల ముందే ఈ ఆసక్తికర ఫోన్ కాల్ జరిగింది.
ఆ విద్యార్థి అధికారులతో మాట్లాడుతూ.. తనకు చదువు అబ్బలేదని, ఏమీ రాకపోవడంతో పరీక్షా పత్రంలో అడిగిన ప్రశ్నలనే మూడు సార్లు తిరిగి రాశానని నిజాయితీగా (?) ఒప్పుకున్నాడు. అంతటితో ఆగకుండా, తనను ఏదో విధంగా పాస్ చేయాలని, అందుకోసం జవాబు పత్రాల్లో (Answer Sheets) డబ్బులు కూడా పెట్టానని చెప్పడం అధికారులను విస్తుపోయేలా చేసింది.
విద్యార్థి ఆందోళనను గమనించిన అధికారులు అతనికి ఫోన్‌లోనే ధైర్యం చెప్పారు. ఇలాంటి పనులు చేయడం తప్పని, డబ్బులు పెడితే పాస్ చేయరని సున్నితంగా మందలించారు. “ఫలితాలు ఎలా ఉన్నా బాధపడకు.. త్వరలోనే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి, ఈసారి బాగా చదువుకుని పరీక్ష రాయి” అంటూ అధికారులు అతనికి కౌన్సెలింగ్ ఇచ్చారు.
Also Read:దక్షిణాదికి అన్యాయం జరగకూడదు:గుత్తా
ఫలితాలు విడుదలయ్యాక సదరు విద్యార్థి మార్కులను పరిశీలించగా, అతను భయపడినట్లే ఫెయిల్ అయ్యాడు.
ఫస్టియర్: రెండు సబ్జెక్టులు
సెకండియర్: మూడు సబ్జెక్టులు
మొత్తంగా ఐదు సబ్జెక్టుల్లో ఆ విద్యార్థి ఫెయిల్ అయినట్లు గుర్తించారు.
గమనిక: పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి కష్టపడి చదవడం ఒక్కటే మార్గం. జవాబు పత్రాల్లో డబ్బులు పెట్టడం లేదా ఇతర అక్రమాలకు పాల్పడటం వల్ల ప్రయోజనం ఉండదు సదా, అవి ఇబ్బందులకు దారితీస్తాయి.

