షారుఖ్ ఖాన్..రిచెస్ట్ యాక్టర్

5
- Advertisement -

భారతదేశంలోనే అత్యంత సంపన్న నటుడిగా షారుఖ్ ఖాన్ తన అగ్రస్థానాన్ని నిలుపుకున్నారు.‘హురున్ ఇండియా రిచ్ లిస్ట్’ 2026 ఎడిషన్ నివేదిక ప్రకారం షారుఖ్‌ ఆస్తి విలువ రూ. 10,000 కోట్లుగా నమోదైంది. దీంతో ఈ జాబితాలో ఉన్న ఇతర నటుల కంటే ఆయన చాలా ముందుంజలో ఉన్నారు. అయితే గతేడాది నమోదైన గణాంకాలతో పోలిస్తే ఈసారి ఆయన ఆస్తి విలువ కొంత తగ్గినట్లు నివేదిక పేర్కొంది.

షారుఖ్ ఖాన్ కేవలం సినిమాల్లో నటించడం ద్వారానే కాకుండా, ఇతర వ్యాపారాల ద్వారా కూడా ఈ స్థాయి సంపదను సమకూర్చుకున్నారు. గౌరీ ఖాన్‌తో కలిసి నిర్వహిస్తున్న ‘రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్’ నిర్మాణ సంస్థతో పాటు ఐపీఎల్‌లోని ‘కోల్‌కతా నైట్ రైడర్స్’ క్రికెట్ ఫ్రాంచైజీలో భాగస్వామ్యం ఆయన ప్రధాన వ్యాపార వ్యాపకాలుగా ఉన్నాయి. రెడ్ చిల్లీస్ సంస్థ సినిమా నిర్మాణాలు, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) రంగాల్లో సేవలందిస్తుండగా, నైట్ రైడర్స్ స్పోర్ట్స్ సంస్థ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పాటు పలు అంతర్జాతీయ క్రికెట్ టీమ్‌లతో అనుబంధం కలిగి ఉంది.

Also Read:బాలాపూర్ లడ్డూ చరిత్ర…

2025 హురున్ జాబితాలో షారుఖ్ ఖాన్ ఆస్తి విలువ రూ. 12,490 కోట్లుగా ఉండగా, తాజా నివేదికలో అది రూ. 2,490 కోట్లు తగ్గి రూ. 10,000 కోట్లకు చేరింది. అంటే ఆయన అంచనా ఆస్తి విలువలో దాదాపు 20 శాతం మేర తగ్గుదల నమోదైంది. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్’ ఆయన సంపదను రూ. 10,800 కోట్లుగా పేర్కొంది. ఆస్తి విలువ తగ్గినప్పటికీ, భారతీయ నటుల విభాగంలో షారుఖ్ ఖాన్ తన మొదటి స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.

- Advertisement -