హనీ సింగ్ డ్రగ్స్ పై షారుఖ్!

4
- Advertisement -

ప్రముఖ సింగర్ యో యో హనీ సింగ్ తన కెరీర్‌లో ఎదుర్కొన్న డ్రగ్స్ వ్యసనం, మానసిక అనారోగ్యం గురించి మరోసారి బహిరంగంగా మాట్లాడారు. బాలీవుడ్ సూపర్ స్టార్స్ షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ ఇద్దరూ తన డ్రగ్స్ అలవాటు గురించి ముందే గ్రహించి తనను తీవ్రంగా హెచ్చరించారని హనీ సింగ్ వెల్లడించారు.

ఓ ఇంటర్వ్యూలో హనీ సింగ్ మాట్లాడుతూ.. నా జీవితంలో నేను చాలా పెద్ద తప్పులు చేశాను. 2012 నుండి 2014 మధ్య కాలంలో నా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు నాకు డ్రగ్స్ అలవాటు అయింది. నేను తప్పుడు మార్గంలో వెళ్తున్నానని ఇండస్ట్రీలోని పెద్దలకు అర్థమైంది. ముఖ్యంగా షారుఖ్ భాయ్, అక్షయ్ పాజీ నన్ను పిలిచి మరీ గట్టిగా మందలించారు. ఈ అలవాటును వెంటనే మానుకోకపోతే కెరీర్.. జీవితం రెండు నాశనమైపోతాయని హెచ్చరించారు అని పేర్కొన్నారు.

అయితే ఆ సమయంలో వారి మాటలను తాను పెడచెవిన పెట్టానని హనీ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో నా చుట్టూ ఉన్న కొందరు తప్పుడు వ్యక్తులు నన్ను మరింత నాశనం చేశారు. సూపర్ స్టార్స్ ఇచ్చిన సలహాలను వినకుండా నా ఇష్టానుసారంగా వ్యవహరించాను. ఫలితంగా నేను మానసిక సమతుల్యతను కోల్పోయి, బైపోలార్ డిజార్డర్ బారిన పడ్డాను. ఆ తర్వాత దాదాపు ఐదేళ్ల పాటు నరకం చూశాను అని ఆయన తన చేదు జ్ఞాపకాలను పంచుకున్నారు.

తన రీఎంట్రీ మరియు ప్రస్తుత జీవితం గురించి మాట్లాడుతూ.. తీవ్రమైన పోరాటం తర్వాత ఆ భయంకరమైన వ్యసనం నుండి, మానసిక అనారోగ్యం నుండి బయటపడ్డానని హనీ సింగ్ చెప్పారు. యువత ఎవరూ కూడా డ్రగ్స్ ఉచ్చులో పడి జీవితాలను పాడుచేసుకోవద్దని ఈ సందర్భంగా ఆయన హితవు పలికారు.

Also Read:పద్మనాభస్వామి ఆలయంలో వజ్రాలు మాయం!

- Advertisement -