తాళ్లపాక అన్నమాచార్యుల 616వ జయంతి ఉత్సవాలు గురువారం అన్నమయ్య జిల్లా తాళ్ళపాకలో ఘనంగా ప్రారంభమయ్యాయి. తాళ్లపాకలోని ధ్యానమందిరం వద్ద ఉదయం శ్రీవారి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి పాల్గొన్నారు.
ఉదయం 10 గంటలకు వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణవేదిక వద్దకు తీసుకొచ్చారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల్ దీక్షితుల ఆధ్వర్యంలో ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. పుణ్యహవచనం, పవిత్రహోమం, కంకణధారణ, మాంగళ్యధారణ, మంగళాశాసనం ఘట్టాలతో శ్రీవారి కల్యాణం జరిగింది. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం ముగిసింది. భక్తులకు టీటీడీ మంచినీరు, మజ్జిగ, ప్రసాదాలు అందించింది. శ్రీవారి కల్యాణం అనంతరం పెద్దసంఖ్యలో భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా స్వరూపానందేంద్రస్వామిస్వామీజీ అనుగ్రహభాషణం చేస్తూ, భగవంతుని తత్వాన్ని తెలుసుకునేందుకు శరణాగతి తప్ప మరో మార్గం లేదని భక్తులకు అన్నమయ్య తెలియజేశారన్నారు. 600 సంవత్సరాలకు పూర్వమే శ్రీవారి తత్వాన్ని, భక్తి, ప్రపత్తి, శరణాగతిని సామాన్యులకు అర్థమయంయ్యేలా చెప్పారన్నారు. భగవంతునిపై పూర్తి విశ్వాసంతో నామసంకీర్తనం చేస్తే ముక్తి కలుగుతుందని అన్నమయ్య కీర్తనల ద్వారా అవగతమవుతుందని వివరించారు.
Also Read:‘రాజు యాదవ్’..ఫన్ అండ్ ఎమోషనల్ రైడ్