శ్రీశైలం గర్భాలయంలో వీడియో..ఈవో సీరియస్

5
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానం లో గర్భాలయంలో వీడియో చిత్రీకరణ ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. పవిత్రమైన గర్భగుడిలో వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం భక్తుల ఆగ్రహానికి కారణమైంది.

ఈ ఘటనపై దేవస్థానం ఈవో (ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) తీవ్రంగా స్పందించారు. ఉగాది ఉత్సవాల సందర్భంగా గర్భాలయంలో వీడియో తీసిన వ్యక్తి చర్యలను అత్యంత బాధ్యతారాహిత్యంగా పేర్కొన్నారు. దేవాలయ నిబంధనలు ఉల్లంఘిస్తూ వీడియో తీసి ప్రచారం చేయడం పవిత్రతకు విఘాతం కలిగించిందని ఆయన అన్నారు.

ఈ ఘటనలో విధుల పట్ల అలసత్వం ప్రదర్శించిన ఆలయ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆలయ సూపర్‌వైజర్‌తో పాటు ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఆలయ భద్రతా విభాగానికి చెందిన సీఎస్‌వోకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.

ఇక గర్భగుడిలో వీడియో తీసిన కర్ణాటకకు చెందిన భక్తుడిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటామని ఈవో తెలిపారు.

Also Read:త్వరలో తెలంగాణకు ప్రధాని మోదీ!

ఈ సంఘటనతో భక్తులలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. దేవాలయ పవిత్రతను కాపాడేందుకు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -