మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు ప్రభావం భారతదేశంలోనూ కనిపించడం ప్రారంభమైంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత సంకేతాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
నగరంలోని అనేక పెట్రోల్ బంకుల్లో “నో స్టాక్” బోర్డులు కనిపించడం వాహనదారులను కలవరపెడుతోంది. ప్రధాన నగర ప్రాంతాలతో పాటు శివారు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఆయిల్ కంపెనీలు పవర్ పెట్రోల్ ధరలను పెంచడంతో వినియోగదారులపై అదనపు భారం పడింది.
తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధుల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20–30 శాతం పెట్రోల్ బంకులు తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. సరఫరా సమస్యలు, ఆపరేషనల్ ఇబ్బందులు ఈ పరిస్థితికి కారణమని వారు చెబుతున్నారు.
పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించడంతో వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారు. కొందరు ముందుగానే ఇంధనం నిల్వ చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా, మరికొందరు దీర్ఘకాలిక కొరత వస్తుందేమోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read:త్వరలో తెలంగాణకు ప్రధాని మోదీ!
ఇక డీలర్స్ అసోసియేషన్ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతోంది. సరఫరా వ్యవస్థను సక్రమంగా నిర్వహించి, ఇంధన కొరతను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం పరిస్థితి తాత్కాలికమేనని అధికారులు చెబుతున్నప్పటికీ, అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా ఇంధన రంగంపై ఒత్తిడి కొనసాగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

