ఎగువన కురుస్తున్న భారీ వర్షాల వల్ల కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి పెరిగింది. ఈ మేరకు 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుండి ప్రాజెక్ట్ కు 3,60,802 క్యూసెక్కులు నీరు వస్తుండగా 2,85,809 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.90 అడుగులుగా చేరింది. నీటినిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలకు గాను 215.3263 టీఎంసీలు మేర వరద కొనసాగుతోంది.
శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి సోమశిలకు 31 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. అధికారులు సోమశిల ప్రాజెక్ట్ నుంచి పెన్నానదికి 44 వేల క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
నాగార్జున సాగర్ నుంచి 3 లక్షల క్యూసెక్కుల వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజ్‌కు 3.30 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ప్రకాశం బ్యారేజ్ ఎగువ, దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.