ప్రేక్షకులను మెప్పించే ‘పిండం’

23
- Advertisement -

ప్రముఖ హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. అవసరాల శ్రీనివాస్, ఈశ్వరీ రావు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు మీడియాతో ముచ్చటించిన అవసరాల శ్రీనివాస్ చిత్ర విశేషాలను పంచుకున్నారు.

పిండం సినిమా అంగీకరించడానికి కారణం ఏంటి?
ఈ సినిమా కథ చెప్పేముందు నాకు దర్శకుడు తీసిన స్మోక్ అనే షార్ట్ ఫిల్మ్ చూపించారు. ఆ షార్ట్ ఫిల్మ్ నాకు ఎంతగానో నచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ మెప్పించింది. రచయితగా, దర్శకుడిగా ఆయనలో మంచి ప్రతిభ ఉందని అర్థమైంది. ఆ తర్వాత కథ కూడా నచ్చడంతో ఈ చిత్రం ఖచ్చితంగా బాగా చేయగలరనే నమ్మకంతో పిండం చేయడానికి అంగీకరించాను.

పిండం టైటిల్ విషయంలో మీరేమైనా సూచనలు చేశారా?
కథ చాలా బాగుంది. కానీ పిండం టైటిల్ విషయంలో మరోసారి ఆలోచించండని దర్శకుడితో మామూలుగా అన్నాను. అప్పుడు దర్శకుడు చెప్పిన సమాధానం ఏంటంటే.. చావు పుట్టుకల్లో పిండం ఉంటుంది. మనిషి జన్మించడానికి ముందు పిండం రూపంలో ఉంటాడు. అలాగే మరణించిన తర్వాత పిండం పెడతాము అని చెప్పారు. పైగా ఈ సినిమా కథ కూడా పిండం అనే టైటిల్ కి ముడిపడి ఉంటుంది. ఈ కథకి సరిగ్గా సరిపోతుందని దర్శకుడు ఆ టైటిల్ ను ఎంచుకున్నారు.

మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
లోక్ నాథ్ అనే అతీంద్రియ శక్తుల మీద పరిశోధనలు చేసే వ్యక్తిగా కనిపిస్తాను. అందులో నిష్ణాతులైన ఈశ్వరీ రావు గారి దగ్గరకు నేను నేర్చుకోవడానికి వెళ్తాను. ఆ విధంగా నడుస్తుంది నా పాత్ర.

స్వతహాగా రచయిత అయిన మీరు ఈ సినిమా రచనలో ఏమైనా భాగం అయ్యారా?
అలాంటిదేం లేదు. చాలా మంది ఇది అడుగుతుంటారు. మీరు రచయిత, దర్శకుడు కదా.. సెట్ లో ఏమైనా చెబుతుంటారా అని. కానీ ఒక నటుడిగా నేను సెట్ మీదకు వెళ్ళినప్పుడు నేను నేర్చుకోవడానికే ఎక్కువ ఇష్టపడతాను. ఒక్కొక్క దర్శకుడిది ఒక్కో పద్ధతి. కొందరికి కొన్ని జానర్ల మీద ఎక్కువ పట్టు ఉంటుంది. అందుకే నేను సెట్ కి వెళ్ళినప్పుడు చెప్పడం కంటే, కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికే ప్రయత్నిస్తాను.

హారర్ జానర్ సినిమాలపై మీ అభిప్రాయం ఏంటి?
నేను మామూలుగా హారర్ సినిమాలను పెద్దగా ఇష్టపడను. అయితే అనుకోకుండా ‘ప్రేమ కథా చిత్రమ్’ థియేటర్ లో చూస్తున్నప్పుడు ప్రేక్షకుల స్పందన చూసి ఆశ్చర్యపోయాను. కొంచెం భయపెడితే జనాలు శ్రద్ధగా సినిమా చూస్తారని అర్థమైంది. అయితే కేవలం భయపెట్టడమే కాకుండా, ప్రేక్షకులకు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే పాయింట్ కూడా ఉండాలనేది నా అభిప్రాయం. అలాంటి సినిమానే ఈ పిండం.

Also Read:అజీర్తితో భాదపడే వారికి..అద్బుతమైన చిట్కా!

పిండం సినిమాకి ఎలాంటి స్పందన వస్తుంది అనుకుంటున్నారు?
దర్శకుడు సాయి కిరణ్ గారు, నిర్మాత యశ్వంత్ గారు సినిమా మీద ఇష్టంతో యూఎస్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఈ సినిమా మంచి విజయం సాధించి, మందు ముందు వారు మరిన్ని మంచి సినిమాలు తీసే అవకాశం ఇస్తుందని నమ్ముతున్నాను.

ఈశ్వరీ రావు గారితో కలిసి పని చేయడం ఎలా ఉంది?
అప్పటిదాకా ఒకలా ఉంటారు. ఒక్కసారి కెమెరా ఆన్ చేయగానే ఒక్కసారిగా పాత్రలో లీనమైపోతారు. సినిమాలో మా ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు మెప్పిస్తాయి.

పిండం గురించి ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు?
మా సినిమా చూడండి అని మనం ప్రేక్షకులను అడగటం కంటే.. ట్రైలర్ వాళ్ళకి నచ్చి, సినిమాలో విషయం ఉంది అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళే థియేటర్లకు వస్తారని నేను నమ్ముతాను. అయితే ఈ సినిమా విషయంలో నేను ఒకటి చెప్పదలచుకున్నాను. ట్రైలర్ తో పాటు మీరు దర్శకుడు తీసిన స్మోక్ అనే షార్ట్ ఫిల్మ్ కూడా చూడండి. ఈ దర్శకుడు ఖచ్చితంగా కథను బాగా చెప్పగలడు అని నమ్మకం కలిగి పిండం సినిమా చూడటానికి వస్తారు.

రచన, దర్శకత్వం, నటన.. ఈ మూడింటిలో మీకు బాగా ఇష్టమైనది ఏంటి?
రాయడం బాగా ఇష్టం. ఎందుకంటే ఎవరి మీద ఆధారపడకుండా స్వేచ్ఛగా రాయగలం. నటన అనేది ఇతరుల కలలో మనం భాగం కావడం లాంటిది. దర్శకత్వం అనేది క్రియేటివిటీ ఉండటంతో పాటు అందరినీ మేనేజ్ చేయగలగాలి.

తదుపరి సినిమాలు?
త్వరలో విడుదల కానున్న ఈగల్ లో నటించాను. కిస్మత్ అనే సినిమాలో నటిస్తున్నాను. అలాగే కన్యాశుల్కం చేస్తున్నాను. దాంతో పాటు దర్శకుడిగా తదుపరి సినిమా కోసం ఒక మర్డర్ మిస్టరీ కథను సిద్ధం చేస్తున్నాను. కుమారి శ్రీమతి సీక్వెల్ చేయడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.

- Advertisement -