భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి రమ్మని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని ఆహ్వానించారు. ఆలయ అధికారులు, వేదపండితులు గురువారం అరణ్య భవన్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 21న రాములవారి కళ్యాణం జరుగనుంది.
కాగా, కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ సారి కూడా భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలను నిరాండంబరంగా నిర్వహించనున్నట్లు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.. కొద్ది రోజులుగా పెరుగుతున్న కరోనా కేసుల కట్టడికి అన్ని మతాల పండుగల నిర్వహణపై ప్రభుత్వం అంక్షలు విధించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు.
గతేడాదిలో నిర్వహించినట్లుగానే పరిమిత సంఖ్యలోనే కోవిడ్ నిబంధనలకు లోబడి వేడుకను జరుపుతామని మంత్రి స్పష్టం చేశారు. కరోనా దృష్ట్యా భక్తులు ఎవరూ శ్రీరామనవమి నాడు సీతారామ కల్యాణాన్ని వీక్షించడానికి భద్రాద్రికి రావొద్దని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందుజాగ్రత్త చర్యగా భక్తుల రాకపై ఆంక్షలు విధించినట్లు ఇప్పటికే ప్రకటన జారీ చేశారు.