యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆలయ పునర్నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. పునరుద్దరణలో భాగంగా యాదాద్రీశుడి కొండకు ఇరువైపులా నిర్మించబడిన రక్షణగోడతో కోల్పోయిన సహజత్వాన్ని తిరిగి ప్రతిష్టించేందుకు ఆలయ అభివృద్ధి సంస్థ దృష్టి సారించింది. ఆ కట్టడాలపైనే రకరకాల వృక్షాలు, తీగలతో వనంలా రూపొందించే లక్ష్యంతో ప్రణాళికలను చేస్తున్నట్లు యాడా వైస్ చైర్మన్ కిషన్ రావు వెల్లడించారు.
ఆధ్యాత్మిక చింతనకు ల్యాండ్‌స్కేప్‌లో నరసింహస్వామి వివిధ రూపాలను పొందుపరిచేందుకు రూపకల్పన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ, పడమర దిశల్లో కొండకు రెండు వరుసల్లో వివిధ రకాల మొక్కలు, ఔషద వృక్షాల పోషనకు ల్యాండ్‌స్కేప్ పనులు జరుగుతున్నాయి. నమూనాలా ప్రకారం రూపొందితే యాదాద్రి క్షేత్రం ప్రకృతి అందాల ప్రతిబింబంగా మారి ఆహ్లాదకరమైన ఆద్యాత్మికతను అందించనుంది. ఇక ఇక్కడి వచ్చే భక్తులను ఆకట్టుకునేలా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.