భారత్‌లో స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ల ఉత్పత్తి..

180
Sputnik V
- Advertisement -

భార‌త్‌కు చెందిన ప్ర‌ఖ్యాత ఫార్మ‌సీ కంపెనీ పనేసియా బ‌యోటెక్‌ రష్యాకు చెందిన స్పుత్నిక్ వి కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తి భారత్‌లో ప్రారంభించింది. స్పుత్నిక్- వి వ్యాక్సిన్లను రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్), పనేసియా బయోటెక్ భారత్‌లో ఉత్పత్తి చేస్తున్నాయి. ఏడాదికి 10 కోట్ల స్పుత్నిక్ వి డోసులు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. కాగా, భారత గడ్డపై తయారైన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ మొదటి బ్యాచ్ టీకాలను రష్యాలోని గమలేయా ఇన్ స్టిట్యూట్ కు పంపనున్నారు. స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది గమలేయా సంస్థ అని తెలిసిందే. భారత్‌లో తయారైన వ్యాక్సిన్ల నాణ్యతను గమలేయా ఇన్ స్టిట్యూట్ పరీక్షించనుందని ఆర్డీఐఎఫ్ వెల్లడించింది.

కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలయ్యాక ప్రపంచంలోనే మొట్టమొదటగా అనుమతులు పొందిన వ్యాక్సిన్ స్పుత్నిక్- వి. భారత్‌లో ఈ రష్యా వ్యాక్సిన్‌కు ఏప్రిల్‌లో అనుమతులు లభించాయి. కాగా, రష్యాలో తయారైన స్పుత్నిక్ వి డోసులు ఇప్పటికే రెండు విడతలుగా భారత్‌కు చేరుకున్నాయి. తొలి విడతలో 1.50 లక్షల డోసులు, రెండో విడతలో 60 వేల డోసులు సరఫరా చేశారు. మే నెలాఖరుకు మరో 30 లక్షల డోసులు భారత్ కు రానున్నాయి. వీటిని భారత్‌లోనే నింపి పంపిణీ చేస్తారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా 66 దేశాలు స్పుత్నిక్ టీకాల‌ను రిజిస్ట‌ర్ చేశాయి. స్పుత్నిక్ టీకా సామ‌ర్థ్యం 97.6 శాతంగా ఉంది. గ‌త ఏడాది డిసెంబ‌ర్ అయిదో తేదీ నుంచే ర‌ష్యాలో స్పుత్నిక్ వీ టీకాలు పంపిణీ సాగింది. మాన‌వుల‌కు సంక్ర‌మించే అడినోవైర‌ల్ వెక్టార్ల ద్వారా స్పుత్నిక్ టీకాల‌ను త‌యారు చేశారు. కోవిడ్ సెకండ్ వేవ్‌తో బాధ‌ప‌డుతున్న భార‌త్‌కు.. పానేసియాతో కుదిరిన డీల్ ఊర‌ట‌నిస్తుంద‌ని ఆర్డీఐఎఫ్ సీఈవో కిరిల్ డిమిత్రేవ్ తెలిపారు. ఇదో కీల‌క‌మైన అడుగు అని, ఆర్డీఐఎఫ్‌తో క‌లిసి స్పుత్నిక్‌ను ఉత్ప‌త్తి చేస్తామ‌ని, దీంతో దేశంలో మ‌ళ్లీ సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొంటాయ‌ని పానేసియా బ‌యోటెక్ ఎండీ డాక్ట‌ర్ రాజేశ్ జైన్ తెలిపారు.

- Advertisement -