ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2021 సూపర్ 12లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పొలార్డ్ సేన నిర్దేశించిన 144 పరుగుల విజయ లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 10 బంతులు మిగిలి ఉండగానే అందుకుంది. నాలుగు పరుగుల వద్ద కెప్టెన్ తెంబా బవుమా (2) రనౌట్‌గా వెనుదిరిగాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డుసెన్‌తో కలిసి రీజా హెండ్రిక్స్‌తో జట్టును విజయం దిశగా నడిపాడు. ఇద్దరూ ఎలాంటి జంకుగొంకు లేకుండా యథేచ్ఛగా షాట్లు ఆడారు. ఈ క్రమంలో 30 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 39 పరుగులు చేసిన హెండ్రిక్స్ అవుటయ్యాడు. ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన మార్కరమ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా అర్ధ సెంచరీ (51) చేసి జట్టుకు అద్వితీయ విజయాన్ని అందించాడు. డుసెన్ 43 పరుగులు (నాటౌట్) చేశాడు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ఎవిన్ లూయిస్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 56 పరుగులు చేయగా, కెప్టెన్ కీరన్ పొలార్డ్ 26 పరుగులు చేశాడు. సిమన్స్ 16, పూరన్, క్రిస్ గేల్ చెరో 12 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు.
సౌతాఫ్రికా బౌలర్లలో ప్రెటోరియస్ 3, కేశవ్ మహారాజ్ 2, రబడ, నార్జ్ చెరో వికెట్ తీసుకున్నారు. నాలుగు ఓవర్లలో 14 పరుగలు మాత్రమే ఇచ్చిన సౌతాఫ్రికా బౌలర్ నార్జ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడిన విండీస్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.