కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది “రాజ్యాంగంపై జరుగుతున్న దాడి” అని ఆమె అభివర్ణించారు. ఏప్రిల్ 16 నుండి జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.
దేశ భవిష్యత్తును, రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని ప్రభావితం చేసే ఇంతటి కీలక నిర్ణయంపై చర్చించేందుకు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయకపోవడాన్ని సోనియా గాంధీ తప్పుబట్టారు. విపక్షాల విజ్ఞప్తిని కేంద్రం తోసిపుచ్చడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధమని ఆమె మండిపడ్డారు.
రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ, జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చేకూర్చేలా ఈ ప్రక్రియ ఉండబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలతో కనీస సంప్రదింపులు జరపకుండానే ప్రభుత్వం ముందడుగు వేయడం సరికాదన్నారు.మహిళా రిజర్వేషన్ బిల్లు అమలును పునర్విభజనతో ముడిపెట్టడం కేవలం కాలయాపన చేయడమేనని విమర్శించారు.
ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలను దాదాపు 816కి పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు భారీగా పెరుగుతాయని, ఇది పార్లమెంట్‌లో ప్రాంతీయ సమతుల్యతను దెబ్బతీస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని సోనియా గాంధీ ఆరోపించారు.
ప్రభుత్వం ఏప్రిల్ 16 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ, జేడీయూ తమ ఎంపీలకు విప్ జారీ చేయడంతో, పార్లమెంట్ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద యుద్ధమే జరిగేలా కనిపిస్తోంది.
Also Read:వరుణ్ తేజ్..’కొరియన్ కనకరాజు’!

