జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం, ఆయన ఉపవాస దీక్ష 21వ రోజున క్షీణించడంతో శనివారం ఆయనను ఆసుపత్రికి తరలించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. అలాగే జంతర్ మంతర్ వద్ద ఉన్న నిరసనకారులను కూడా పోలీసులు తొలగించడం ప్రారంభించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం నిపుణులైన వైద్యుల సలహా మేరకు శ్రీ సోనమ్ వాంగ్‌చుక్ క్షీణిస్తున్న ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, అవసరమైన వైద్య సంరక్షణ కోసం ఆయనను ఆసుపత్రికి తరలించాము. హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తున్నప్పుడు నిరసనకారులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు., దీనివల్ల స్వల్ప తోపులాట జరిగింది. అయితే పోలీసులు గరిష్ట సంయమనం పాటించి, ఈ ప్రక్రియను సురక్షితంగా పూర్తి చేశారు అని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
జంతర్ మంతర్ వద్ద ఉన్న నిరసనకారులు వీలైనంత త్వరగా శాంతియుతంగా ఈ స్థలాన్ని ఖాళీ చేయాలని మేము కోరుతున్నాము అని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
నీట్ (NEET) పేపర్ లీక్ ఉదంతం తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష చేపట్టారు. నిరసనకారులను ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని కోరడంతో నిరసన స్థలం వద్ద భారీగా ఢిల్లీ పోలీసు బలగాలను మోహరించారు.
న్యూఢిల్లీ డీసీపీ సచిన్ శర్మ మాట్లాడుతూ…గౌరవనీయ హైకోర్టు ఆదేశాల ప్రకారం, ఆయన ఆరోగ్య పరిస్థితి మరియు వైద్యుల సలహాలను పరిగణనలోకి తీసుకుని, మిస్టర్ సోనమ్ వాంగ్‌చుక్‌ను ఇక్కడి నుండి చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాము; అక్కడ ఎలాంటి లాఠీచార్జ్ గానీ మరే ఇతర గొడవలు గానీ జరగలేదు అని స్పష్టం చేశారు.
కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దిప్కే మాట్లాడుతూ…సోనమ్ సార్‌ను ఇక్కడి నుండి తీసుకెళ్లడం వల్ల ఈ ఉద్యమం ముగుస్తుందని వారు భావిస్తే, అది వారి పొరపాటే. మేము ఇక్కడే ఉంటాము, జూలై 20న పార్లమెంటుకు మార్చ్ (పాదయాత్ర) నిర్వహిస్తాము అని చెప్పారు. ఇప్పటివరకు మేము ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేశాము. కానీ ఈ ఘోరమైన చర్య తర్వాత, మేము ఇప్పుడు నరేంద్ర మోదీ రాజీనామాను డిమాండ్ చేస్తాము అని ఆయన ఆరోపించారు.
Also Read:ఈడీకి మేమేం భయపడలేదు!

