సైఫ్ అలీఖాన్ చెల్లెలు బాలీవుడ్ హీరోయిన్ సోహా అలీఖాన్ మహర్నవమి రోజున పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కునాల్ ఖేము, సోహా జంటకు ఆడ పిల్ల పుట్టింది. ఈ విషయాన్ని కునాల్ ఖేము స్వయంగా ప్రకటించాడు. పాప, సోహా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపిన కునాల్.. తన జీవితంలో అత్యంత మధుర క్షణాలను ఎంజాయ్ చేస్తున్నట్టు ట్వీట్ చేశాడు. సోహా అలీఖాన్, కునాల్ ఖేమ్ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. పెద్దల అంగీకారంతో పారిస్ లో వీళ్ల ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగింది. తర్వాత 2015లో ముంబయిలో వీళ్ల వివాహం కూడా భారీ ఎత్తున జరిగింది. తన బేబీ బంప్ తో కొన్ని ఫొటో షూట్స్ లో కూడా పాల్గొంది సోహా.
కునాల్ ఖేము పోస్ట్ మీద కామెంట్ చేస్తూ చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు అభినందనల జల్లు కురిపించారు. ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రా, రాహుల్ ధోలాఖియా, సోఫీ చౌదరి, అలోక్ నాథ్, వివేక్ అగ్నిహోత్రి, సోనీ రజ్దాన్ వంటి చాలా మంది ప్రముఖులు కునాల్, సోహా దంపతులను అభినందించారు. సోహా గర్భవతి అయినప్పటి నుంచి బిడ్డ ఎదుగుదలకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆ దంపతులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇటీవల బేబీ షవర్ వేడుక కూడా నిర్వహించారు. ఈ వేడుకకు సోహా అలీ ఖాన్ వదిన, కరీనా కపూర్ ఖాన్ తన కుమారుడు తైమూర్‌తో సహా హాజరైన సంగతి తెలిసిందే.