దేశంలో అవినీతి లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో రద్దు చేసిన పెద్ద నోట్లు.. చిత్తు కాగితాలుగా మారుతున్నాయి. ఆక్రమంగా డబ్బులు దాచిన బడా బడా వ్యాపారుల నుండి చిల్లర దొంగతనాలు చేసుకునే దొంగల వరకు తమ దగ్గర ఉన్న పెద్ద నోట్లను ఏం చేయాలో తోచక తలలు కొట్టుకుంటున్నారు. అయితే మోడీ తీసుకున్న ఈ నిర్ణయం దొంగల్లో మార్పు తీసుకొచ్చినట్టుంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ రెండు రోజుల్లో దొంగతనాలు మాత్రం గణనీయంగా తగ్గాయి. జేబు దొంగతనాలు అయితే దాదాపు ఆగిపోయాయి. అక్కడక్కడా కొందరు పర్సులు కొట్టేసిన దొంగలు అందులోని నోట్లను తీసి మర్యాదగా తిరిగి యజమానులకు అప్పజెబుతున్నారు. మంగళవారం రాత్రి పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ ప్రకటించిన తర్వాత గ్రేటర్ నోయిడాలో ఓ పర్సు దొంగతనం జరిగింది.
వికాశ్ కుమార్ అనే వ్యక్తి నోయిడాలో ఐషర్ సెక్టార్లో నివాసం ఉంటాడు. రాత్రి 11 గంటల సమయంలో పని ముగించికొని తిరిగి ఇంటికి వెళ్లేందుకు బస్టాండ్‌కు వెళ్తుండగా మార్గమధ్యంలో బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఆయన పర్సును కొట్టేశారు. పర్సులో మూడు రూ.500 నోట్లున్నాయి. పర్సు పోయిందన్న సంగతి గుర్తించిన వికాస్.. పోలీసులను సమాచారం ఇవ్వాలనుకున్నాడు. అయితే ఇంతలో ఆ దొంగలు మళ్లీ తనవైపు రావడం గమనించాడు. ‘‘నా వంక ఆగ్రహంగా చూస్తూ పర్సు విసిరేశారు. ‘‘అందులో వందనోట్లు పెట్టుకోవడం తెలీదా?’ అని అరుస్తూ నా చెంపపై కొట్టి వెళ్లిపోయారు’’ అని భాదితుడు మీడియాకు తెలిపాడు.