టాలీవుడ్ లో వేగంగా రూ. 100 కోట్ల వసూళ్లు సాధించిన రెండో సినిమా ‘జనతా గ్యారేజ్’. మొదట్లో డివైడ్ టాక్ తెచ్చుకున్న తర్వాత సక్సెస్ టాక్‌తో టాలీవుడ్‌లో రికార్డు కలెక్షన్లను వసూలు చేసింది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి ఓ మైలురాయిని అందించింది. అయితే, జనతా గ్యారేజ్‌పై దర్శకుడు కొరటాల శివ మాత్రం కాస్త భిన్నంగా స్పందించారు.
కమెడియన్ శ్రీనివాస రెడ్డి హీరోగా నటించిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమా ఫంక్షన్‌కు కొరటాల శివ హాజరయ్యాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఒక మంచి సినిమా తెరకెక్కాలంటే అన్ని విభాగాలు కలసి పనిచేయాలి, మంచి క్యారెక్టర్లు కుదరాలి. కానీ, ‘జనతాగ్యారేజ్’ విషయంలో అలా జరగలేదు. నేను తీసిన ‘జనతాగ్యారేజ్’లో కొన్ని లోపాలున్నాయి. కానీ, ఈ శుక్రవారం విడుదల కానున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ మాత్రం పర్‌ఫెక్ట్ సినిమా’ అని అన్నాడు.
ఇండియాలోనే కాదు ఓవర్సిస్‌లోనూ జనతా గ్యారేజ్ సత్తాచాటింది. ప్రకృతి ప్రేమికుడిగా సరికొత్త పాత్రలో తారక్ విభిన్నంగా కనిపించిన ’జనతా గ్యారేజ్’.. మోహన్ లాల్, సమంత, నిత్యమీనన్ వంటి భారీ తారాగణంతో రూపొందింది. ఈ సినిమాకు మొదట డివైడ్ టాక్ వచ్చినా.. ఎన్టీఆర్, మోహన్‌లాల్ నటన ప్లస్ అయింది. ప్రకృతి ప్రేమికుడిగా ఎన్టీఆర్ చూపిన అభినయానికి ప్రశంసలు దక్కాయి.