దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సిట్ ఏర్పాటు

306
Mahesh Bhgavath

వెటర్నరీ డాక్టర్ దిశ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు పోలీసులపై ప్రశంసల వర్షం కురిపిస్తే.. మరికొందరు తప్పుబట్టారు.. అయితే ఈ ఎన్ కౌంటర్ పై మహిళా సంఘాలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. నిందితుల ఎన్ కౌంటర్ పై తెలంగాణ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది.

రాచకొండ పోలీస్ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో సిట్‌ బృందాన్ని ఏర్పాటు చేసింది సర్కార్. ఈ టీమ్‌లో వనపర్తి ఎస్పీ అపూర్వరావు, మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, రాచకొండ ఎస్‌వోటీ డీసీపీ సురేందర్‌, సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్‌, సంగారెడ్డి డీసీఆర్‌బీ సీఐ వేణుగోపాల్‌రెడ్డి సభ్యులుగా ఉన్నారు. దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై పూర్తి విచారణ జరపాలని సిట్‌ను ఆదేశించింది ప్రభుత్వం.

మరోవైపు చటాన్‌పల్లి లో జరిగిన ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ప్రతినిధుల బృందం దిశ కుటుంబ సభ్యులు, ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన నిందితుల కుటుంబ సభ్యుల వాంగ్మూలం తీసుకోవడంతో పాటు వివరాలు సేకరించింది. ఇటు హత్యాచార ఘటన గురించి దిశ తండ్రితో పాటు సోదరిని ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు అడిగి తెలుసుకున్నారు.