కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు.. ఆధిక్యంలో బీజేపీ..

697
bjp
- Advertisement -

కర్ణాటకలో ఈనెల 5న 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. అభ్యర్థులు, పార్టీ పెద్దలు, ప్రభుత్వంతో పాటు విపక్షాలు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుండగా ఇప్పటి వరకు వెల్లడైన అన్ని దశల్లోనూ అధికార బీజేపీ ఆధిక్యంతో దూసుకెళ్తోంది. బీజేపీ-11, కాంగ్రెస్-2, జేడీఎస్-1, ఇతరులు-1 స్థానంలో ముందంజలో ఉన్నారు.

ఈ ఉప ఎన్నికల్లో 66.25 శాతం పోలింగ్ నమోదైంది. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో ఇద్దరు ఎమ్మెల్యేలపై న్యాయస్థానాల్లో కేసులు ఉండటంతో ఆ రెండు నియోజకవర్గాలకు ఎన్నికలు జరగలేదు. దీంతో అసెంబ్లీలో మిగిలిన 222కు గాను మ్యాజిక్ నెంబర్ 112. ప్రస్తుతం బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. స్పీకర్‌తో పాటు మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా బీజేపీకి మద్దతిస్తున్నారు. ఇవాళ వెల్లడయ్యే ఉప ఎన్నికల ఫలితాల్లో కనీసం ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిస్తేనే బీజేపీకి మెజార్టీ ఉంటుంది. లేదంటే ఎడియూరప్ప సర్కారు మైనార్టీలో పడిపోతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 66, జేడీఎస్‌కు 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

14 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ సభ్యుల రాజీనామాలతో ఇటీవలే కాంగ్రెస్- జేడీఎస్ సర్కారు కూలిపోయింది. ఆ వెంటనే రాజీనామాలు చేసిన సభ్యులను స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. దీంతో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి.

- Advertisement -