పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ చీఫ్ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి పంపించారు. అయితే, మొన్నటిదాకా పట్టుబట్టి కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయేలా చేసిన సిద్ధూ.. ఇప్పుడు పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సిద్ధూ ఆకస్మికంగా రాజీనామా చేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
ఒక మనిషి వ్యక్తిత్వ పతనం అతను రాజీపడటం ద్వారా ప్రారంభమవుతుందని తన రాజీనామా లేఖలో సిద్ధూ తెలిపారు. అందుకే, పంజాబ్ భవిష్యత్తు, పంజాబ్ సంక్షేమం విషయంలో తాను ఏ మాత్రం రాజీ పడలేనని ఆయన స్పష్టం చేశారు. ఈ కారణాల వల్లే తాను పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. పీసీసీ పదవికి రాజీనామా చేసినప్పటికీ… కాంగ్రెస్ పార్టీకి మాత్రం సేవ చేస్తానని తెలిపారు.
ఇటీవల పంజాబ్ కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కెప్టెన్ అమరీందర్‌సింగ్‌ను పదవి నుంచి దించడమే లక్ష్యంగా పీసీసీ చీఫ్ సిద్ధూ పావులు కదిపారు. చివరకు అధిష్ఠానాన్ని ఒప్పించి అమరీందర్‌ను గద్దె దించేందుకు ప్లాన్ చేశారు. అయితే ముందే ఈ విషయాన్ని పసిగట్టిన అమరీందర్ సీఎం పదవికి రాజీనామా సమర్పించారు. ఆ తర్వాత చరణ్జీత్సింగ్ను నూతన ముఖ్యమంత్రిగా నియమించడం, కొత్తమంత్రివర్గం కొలువుదీరడం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో సిద్ధూ పీసీసీ చీఫ్ పదవిలోకి వచ్చిన 72 గంటలకే రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.