తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో తీవ్ర కలకలం రేపిన భారీ దోపిడీ ఉదంతం వెలుగు చూసింది. ప్రముఖ యూట్యూబర్ నివాసమే లక్ష్యంగా చేసుకున్న దుండగులు.. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి భారీగా బంగారం, నగదు దోచుకెళ్లారు. ఇందుకు కారణం ఆమె బంగారం, డబ్బుతో చేసిన రీలే కారణం.
కన్యాకుమారి ప్రాంతానికి చెందిన సదరు యూట్యూబర్ కుటుంబ సమేతంగా బయటకు వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగింది. ఇంటికి తిరిగి వచ్చిన యజమానులు.. తాళాలు పగులగొట్టి ఉండటం చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. లోపలికి వెళ్లి పరిశీలించగా బీరువాలో దాచి ఉంచిన నగల పెట్టెలు, నగదు మాయమైనట్లు గుర్తించారు.
సుమారు 118 సవర్ల బంగారు ఆభరణాలు మరియు భారీగా నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.ఈ భారీ చోరీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. వేలిముద్రల నిపుణులు, డాగ్ స్క్వాడ్ సహాయంతో సంఘటనా స్థలం నుండి కీలక ఆధారాలు సేకరించారు.
బాధితుడి ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. యూట్యూబర్ కుటుంబ సభ్యులు బయటకు వెళ్లే సమాచారం తెలిసిన వ్యక్తులే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని, ముందుగానే రేకీ నిర్వహించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read:Asian Games:భారత్‌కు మరో పసిడి
స్థానికంగా ఎంతో ప్రాచుర్యం పొందిన యూట్యూబర్ ఇంట్లోనే ఈ తరహా భారీ దోపిడీ జరగడంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.

