29% మంది మాత్రమే తమ జీతాలతో హ్యాపీ!

2
- Advertisement -

భారతదేశంలో ఉద్యోగం చేస్తున్న వారిలో కేవలం 29 శాతం మంది మాత్రమే ప్రస్తుతం తమకు వస్తున్న జీతాల పట్ల సంతృప్తిగా ఉన్నారని…ఏకంగా 81 శాతం మంది ఉద్యోగులు రాబోయే 12 నెలల్లో తమ జీతాలను పెంచాలని యాజమాన్యాలను కోరాలని ప్లాన్ చేస్తున్నట్లు ఒక తాజా సర్వేలో తేలింది. దేశంలో పెరుగుతున్న జీవన వ్యయం (Living Costs) పట్ల ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతోందని…చాలామంది 10 శాతం కంటే ఎక్కువ జీతాల పెంపును ఆశిస్తున్నారని ఈ నివేదిక హైలైట్ చేసింది.

అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్ (ACCA) నిర్వహించిన ఈ గ్లోబల్ సర్వేలో భారతీయ ఉద్యోగుల మనోభావాలకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ప్రస్తుత జీతాలపై ప్రపంచవ్యాప్తంగా సగటున 36 శాతం మంది ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేయగా భారతదేశంలో ఆ సంఖ్య కేవలం 29 శాతానికే పరిమితమైంది. అంటే ప్రపంచ సగటు కంటే భారతీయుల్లో అసంతృప్తి ఎక్కువగా ఉంది.

పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగానే ఉద్యోగులు తమ జీతాల పెంపును బలంగా ఆశిస్తున్నారు. ప్రస్తుత 2026 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులను వేధిస్తున్న అతిపెద్ద సమస్యల్లో ‘జీవన వ్యయం’ ఒకటని సర్వే పేర్కొంది. భారతదేశంలో మాత్రం టెక్నాలజీ (AI వంటివి) వల్ల ఉద్యోగాలు ఎక్కడ ఊడిపోతాయో అనే భయం తర్వాత జీవన వ్యయమే రెండో అతిపెద్ద ఆందోళనగా నిలిచింది.

జీతాల పెంపును కోరుకునే వారి సంఖ్య గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగింది. 2025లో కేవలం 67 శాతం మంది భారతీయులు మాత్రమే జీతాల పెంపును కోరాలని అనుకున్నారు. 2026లో ఆ సంఖ్య ఏకంగా 81 శాతానికి చేరింది. ఇది ప్రపంచ సగటు (62 శాతం) కంటే చాలా ఎక్కువ. దాదాపు 68 శాతం మంది భారతీయ ఉద్యోగులు 10 శాతం కంటే ఎక్కువ జీతం పెంచాలని ఆశిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రకమైన పెద్ద పెంపును ఆశిస్తున్న వారు కేవలం 37 శాతం మంది మాత్రమే.

Also Read:మోదీకి నచ్చిన..’పెద్ది’!

ఈ సర్వే ఫలితాలు కంపెనీలకు పెద్ద సవాలుగా మారనున్నాయి. మార్కెట్‌లో పోటీ తట్టుకుని ప్రతిభావంతులైన ఉద్యోగులను కంపెనీలోనే ఉంచుకోవాలన్నా , అదే సమయంలో కంపెనీ లాభాల బాటలో నడవాలన్నా యాజమాన్యాలు ఉద్యోగుల అంచనాలకు తగ్గట్టుగా జీతాల పెంపును, కంపెనీ ఆర్థిక వ్యూహాలను సమతుల్యం చేసుకోవాల్సి ఉంటుంది.

- Advertisement -