ఆపదలో ఉన్న పేద కార్మికులను ఆదుకుని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తన ఉదారతను చాటుకున్నారు. అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయి రోడ్డున పడిన గీత కార్మికులను ఆయన స్వయంగా పరామర్శించి, తక్షణ ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు.
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం మెట్ల చిట్టాపూర్ గ్రామంలో ఇటీవల ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో స్థానిక గీత కార్మికులు (గౌడన్నలు) నమ్ముకున్న ఈత వనం పూర్తిగా కాలి బూడిదైంది. తమ దైనందిన జీవనోపాధికి ఆధారమైన ఈత చెట్లు అగ్నికి ఆహుతి కావడంతో, కుటుంబాలను ఎలా పోషించాలో తెలియక గీత కార్మికులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు.
ఈ విషయం తెలుసుకున్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తక్షణమే స్పందించారు. మెట్ల చిట్టాపూర్ గ్రామానికి చేరుకున్న ఆయన, ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించి బాధితులను ఓదార్చారు. వారికి ధైర్యం చెబుతూ.. తన సొంత నిధుల నుండి రూ. 20,000 (ఇరవై వేల రూపాయలు) తక్షణ ఆర్థిక సహాయాన్ని బాధితులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ.. కష్టపడి బతికే గీత కార్మికులకు ఇలాంటి ప్రమాదం జరగడం అత్యంత దురదృష్టకరమన్నారు. ఈత వనం కాలిపోవడంతో ఉపాధి కోల్పోయిన గౌడన్నల కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే స్పందించి, ప్రభుత్వ పరంగా భారీ నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితులకు అన్ని వేళలా తాను తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు.
Also Read:మోదీకి నచ్చిన..’పెద్ది’!

