పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పేరుగాంచిన షోయబ్ అక్తర్ ఇంగ్లిష్‌లో ఓ పోస్ట్ రాసి దానిని ట్విట్టర్‌లో పెట్టాడు. ఆ ట్వీట్‌కు అక్తర్‌ను ట్విట్టర్‌లో ఆడుకుంటున్నారు నెటిజన్లు. ఇంతకీ అక్తర్ ఏమన్నాడంటే.. పాకిస్థాన్ నుంచి ఎవరెస్ట్ ఎక్కిన తొలి మహిళను కలిశానన్నది దాని సారాంశం. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి పాకిస్థానీ మహిళ సమీనా.. అక్తర్ను కలిసింది. సమీనాతో దిగిన ఫొటోను పోస్ట్ చేసి, ఆమెను ప్రశంసిస్తూ అక్తర్ ఇంగ్లీష్‌లో ట్వీట్ చేశాడు.
కానీ పోస్ట్ చూస్తే పాకిస్థాన్ ఫస్ట్ లేడీని కలిశాను అన్నట్లుగా వచ్చింది. తను కూడా సరిగా చదివాడో లేదో గానీ.. దాని అర్థం మాత్రం పూర్తిగా మారిపోయింది. సాధారణంగా పాకిస్థాన్ అధ్యక్షుడి భార్యను ప్రథమ మహిళ అంటారు. ఈ విషయాన్ని గ్రహించిన అభిమానులు అక్తర్ దృష్టికి తీసుకెళ్లి, తప్పును సరిదిద్దాలని ట్విట్టర్లో ప్రయత్నించారు. అయితే అతను వారికి అందుబాటులోకి రాలేదు.
ఇంకేముంది అక్తర్ ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని తెలుసుకున్న నెటిజన్లు అతనిపై జోకులు పేల్చారు. ఇంగ్లిష్ మాట్లాడే పాకిస్థానీలపై అక్తర్ సర్జికల్ స్ట్రైక్ చేశాడంటూ ఒకరు పోస్ట్ చేశారు. ఇంగ్లీష్ ఆత్మహత్య చేసుకోక ముందే అర్జెంట్‌గా ఈ పోస్ట్‌ను మార్చెయ్ అంటూ మరొకరు సలహా ఇచ్చారు. అక్తర్ తన ఇంగ్లీష్‌తో.. రెండు దేశాల ప్రజల్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చాడంటూ.. ఒక్క నిమిషంపాటు భారతీయులు.. పాకిస్తానీలు.. తమ కోపాలను మరిచిపోయి ఒక్కటై అక్తర్‌పై కామెంట్లు చేస్తున్నారంటూ మరొకరు ఆనందం వ్యక్తం చేశారు.