తెలంగాణ యావత్ దేశానికి రోల్ మోడల్‌గా మారింది. సీఎం కేసీఆర్ ముందుచూపుతో ప్రవేశపెట్టిన రైతు బంధు,రైతు భీమా,మిషన్ భగీరథ,మిషన్ కాకతీయ,కంటి వెలుగు వంటి పథకాలు దేశం దృష్టిని ఆకర్షించాయి. పలు రాష్ట్రాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలను అమలు చేస్తుండగా మోడీ సర్కార్ సైతం పీఎం కిసన్ స్కీమ్ పేరుతో రైతు బంధు పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
ప్రజా సంక్షేమంతో పాటు మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం షీ టీమ్స్‌తో రక్షణ కల్పిస్తోంది. దీంతో పాటు వరంగల్ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం తీసుకొచ్చిన షీ టాయ్‌లెట్స్‌కి మంచిరెస్పాన్స్ వస్తోంది.
ప్రయోగాత్మకంగా గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ,వరంగల్ రూరల్ కలక్టరేట్,బాల సముద్రం ఏరియాల్లో షీ టాయ్‌లెట్స్‌ని నిర్మించింది గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్. వీటికి నగర ప్రజల నుండి విశేష స్పందన వస్తుండటంతో మరిన్ని షీ టాయ్‌లెట్స్‌ని నగరమంతా విస్తరించే ఆలోచనలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సిద్ధమైంది.
2017 నవంబర్‌లో గ్రేటర్ వరంగల్ పరిధిలో పైలెట్ ప్రాజెక్టుగా షీ టాయ్‌లెట్స్‌ని ప్రారంభించామని ఆస్కీ టీమ్ లీడర్ రాజమోహన్ రెడ్డి తెలిపారు. అన్ని సౌకర్యాలతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా షీ టాయ్‌లెట్స్ నిర్మాణం చేపట్టామన్నారు. చాలామంది మహిళలు అస్తవ్యస్త నిర్వహణ,క్లీనింగ్ లేకపోవడంతో పబ్లిక్ టాయ్ లెట్స్‌ని ఉపయోగించడం లేదని అందుకే క్లీన్ వరంగల్‌లో భాగంగా ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామన్నారు. వీటి నిర్వహణ కోసం సలహాలు,సూచనలు ఇచ్చేందుకు టోల్ ఫ్రీ నెంబర్‌ని ఏర్పాటుచేశామన్నారు.
ఆరు నెలల నుండి తానిక్కడ పనిచేస్తున్నానని రోజురోజుకి షీ టాయ్‌లెట్స్‌ని ఉపయోగించే వారి సంఖ్య పెరుగుతోందని చెబుతోంది రమణమ్మ. తాను వచ్చిన ఆరంభంలో రోజుకు పదిమంది మాత్రమే ఉపయోగిస్తే ప్రస్తుతం ఆ సంఖ్య 40కి చేరిందన్నారు. మొత్తంగా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌లో ప్రారంభించిన షీ టాయ్‌లెట్స్‌కి మంచి స్పందన వస్తుండటంతో త్వరలో రాష్ట్రమంతట వీటిని విస్తరించే ఆలోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం.