వాలెంటైన్స్ డే సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా షీ టీమ్స్ అప్రమత్తమయ్యాయి. ప్రేమికుల రోజు సందర్భంగా కలిసి తిరిగిన జంటలకు పెళ్లిళ్లు చేసేందుకు భజరంగ్ దళ్,వీహెచ్‌పీ లాంటి సంస్థలు ప్రయత్నించడం అప్పట్లో వివాదాస్పదమైంది. ఇలాంటి ఘటనల దృష్ట్యా షీ టీమ్స్‌తో పర్యవేక్షణ చేపట్టేలా ఏర్పాట్లు చేశారు పోలీసులు.
యువతీ,యువకులు సంచరించే ప్రదేశాల్లో షీ టీమ్స్ బృందాలతో పర్యవేక్షించనున్నారు. ఇందిరాపార్క్, నెక్లెస్ రోడ్డు, పీపుల్స్ ప్లాజా, పబ్లిక్ గార్డెన్, బిర్లా టెంపుల్, మల్టీప్లెక్స్‌లు తదితర ప్రాంతాల్లో నిఘా పెంచామని పోలీసు అధికారులు తెలిపారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ముఖ్యంగా గరువారం రాత్రి సమయంలో కొన్ని ప్రత్యేక ప్రాంతాలతో పాటు ఐస్‌క్రీమ్ పార్లర్లు, పబ్‌లు, రెస్టారెంట్ల వద్ద నిఘా ఉంచనున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉండటంతో ఆయా చోట్ల గస్తీ పెంచామని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.
మరోవైపు శివసేన ఫిబ్రవరి 14న ‘బ్లాక్ డే’గా నిర్వహిస్తోంది. ఇక భజరంగ్ దళ్ కార్యకర్తలు సైతం ప్రేమికుల రోజున రోడ్ల మీద ఎవరైనా ప్రేమజంట కనిపిస్తే వారికి పెళ్లిళ్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఓ పూజారిని సైతం వెంటబెట్టుకుని తిరుగుతున్నామని ఆ సంస్థ నేతలు చెబుతున్నారు.