కేరళంలోని తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.డి. సతీశన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కూటమి నేతలు ఈ వేడుకకు తరలివచ్చారు. అయితే, ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ హాజరుకాకపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రానికి చెందిన అత్యంత కీలక నేత, అందునా తిరువనంతపురం వేదికగానే జరుగుతున్న ఈ వేడుకకు థరూర్ ఎందుకు రాలేదనే దానిపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవడంతో, ఆయన స్వయంగా దీనిపై స్పష్టత ఇచ్చారు.
తాను ఈ వేడుకకు హాజరుకాకపోవడానికి ఎలాంటి రాజకీయ కారణాలు లేవని శశి థరూర్ స్పష్టం చేశారు. చాలా కాలం క్రితమే నిశ్చయమైన ఒక ముఖ్యమైన అంతర్జాతీయ పర్యటన కారణంగానే తాను ఈ కార్యక్రమానికి రాలేకపోయానని ఆయన తెలిపారు. ఒక అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు తాను ప్రస్తుతం విదేశాల్లో ఉన్నానని, అందుకే సొంత నియోజకవర్గంలో జరుగుతున్న ఈ వేడుకను ప్రత్యక్షంగా చూడలేకపోయానని వివరించారు.
తాను దూరంగా ఉన్నప్పటికీ, సరికొత్త విజయాన్ని అందుకున్న ముఖ్యమంత్రి వి.డి. సతీశన్‌కు మరియు ఆయన నూతన మంత్రిమండలికి శశి థరూర్ సోషల్ మీడియా ద్వారా తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ప్రభుత్వం కేరళ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అద్భుతమైన పాలన అందిస్తుందని ఆశిస్తున్నాను అని థరూర్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
Also Read:చైనాలో పుతిన్ పర్యటన

