ఒక నటి 250 సినిమాలు చేయటం చిన్న విషయం కాదు. అది కూడా శృంగార తారగా అంటే మామూలు విషయం కాదు. దక్షిణాదిలో శృంగార తార అన్న వెంటనే షకీలా అన్న పేరున చప్పున గుర్తుకు రాక మానదు. తెరపై హాట్ అందాలతో నిద్ర లేకుండా చేసే షకీలా.. తెర ముందుకు వచ్చి నోరు విప్పితే.. ఆమెను అంత తప్పులా ఫీల్ అయినందుకు కన్నీళ్లు రాక మానదు. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు షకీలా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలతో పాటు..తన వ్యక్తిగత వివరాల్ని వెల్లడించారు. సంచలనంగా ఉన్న ఆమె చెప్పిన వివరాలు చూస్తే.
కేవలం డబ్బు సంపాదించేందుకే సినిమాల్లోకి వచ్చానని శృంగార తార షకీలా అన్నారు. ఉన్నది ఉన్నట్టుగానే చెబుతున్నానని… తన కుటుంబం కోసమే నటినయ్యానని… కావాల్సినంత సంపాదించానని ఆమె తెలిపారు. తనకు ముగ్గురు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు, ఒక తమ్ముడు, ఒక చెల్లి ఉన్నారని చెప్పారు. వీరిలో ఒక అక్క చిన్నప్పుడే చనిపోయిందని తెలిపారు.
తమది చాలా పెద్ద ఫ్యామిలీ అని… ఓ అక్క పెళ్లి చేసుకున్నాక కూడా తమ ఇంట్లోనే ఉండేదని చెప్పారు. ఒక అన్నేమో డ్రగ్ అడిక్ట్ అని… తమ్ముడు పదో తరగతి ఫెయిల్ అయ్యాడని… ఎవరూ కూడా జీవితంలో సరిగా సెటిల్ అయ్యే పరిస్థితే లేదని తెలిపారు. తమ కుటుంబ కష్టాలను పోగొట్టేందుకే తాను సినిమాల్లోకి వచ్చానని వెల్లడించారు. తాను తొలి పారితోషికం అందుకునే సమయానికి ఇంటి అద్దె కట్టి 23 నెలలు అయిందని చెప్పారు.