రైతులతో కేంద్రం చర్చలు విఫలం.. 8న మరోసారి భేటీ..

226
Farmers Protest
- Advertisement -

సోమవారం ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో రైతు సంఘాలతో కేంద్రం ఏడో దఫా చర్చలు జరిపింది. ఈ చర్చలు కొద్దిసేపటిక్రితం ముగిశాయి. సుమారు నాలుగు గంటలపాటు చర్చలు జరిగాయి. కానీ ప్రతిష్టంభన తొలగలేదు. మూడు వ్యవసాయ చట్టాల రద్దు, పంటకు మద్దతు ధరపై ఇరు వర్గాలు వెనక్కు తగ్గలేదు. ఈ నేపథ్యంలో జనవరి 8న మరోసారి సమావేశం కావాలని కేంద్రం నిర్ణయింది. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌తోపాటు కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, సోమ్ ప్రకాష్ ఈ చర్చల్లో పాల్గొన్నారు.

వ్యవసాయ చట్టాల్లో పేర్కొన్న ఏదైనా నిబంధనను రైతులు సమస్యగా భావిస్తే దానిపై సమీక్ష చేస్తామని చెప్పారు. రైతుల ప్రయోజనం కోసం తెచ్చిన వ్యవసాయ చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోబోమని అన్నారు. ఈ నెల 8న మరో విడత చర్చలను నిర్వహిస్తామని వెల్లడించారు. కేంద్ర మంత్రులు గతంలో మాదిరిగా రైతులతో కలిసి భోజనం కూడా చేయలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య చర్చల పురోగతిలో మరోసారి ప్రతిష్టంభన నెలకొన్నది.

మరోవైపు వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్నవే తమ రెండు ప్రధాన డిమాండ్లని రైతు సంఘాలు తెలిపారు. వీటిని పరిష్కరించడమే కేంద్ర ప్రభుత్వం ముందున్న మార్గమని తాము చెప్పినట్లు రైతు నేత జోగిందర్‌ సింగ్‌ చెప్పారు. కాగా జనవరి 26 లోగా తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకపోతే వేలాది మంది రైతులు రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించడానికి తమ ట్రాక్టర్లలో రాజధానిలోకి ప్రవేశిస్తారని వ్యవసాయ సంఘాల వేదిక అయిన సంయుక్త్‌ కిసాన్ మోర్చా మరోసారి హెచ్చరించింది.

- Advertisement -