పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో సిబ్బంది నియామకానికి సంబంధించి భారత ఎన్నికల సంఘం (ECI) జారీ చేసిన సర్క్యులర్‌పై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇది అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
ఎన్నికల సంఘం జారీ చేసిన సర్క్యులర్ తప్పు కాదని, అది నిబంధనలకు విరుద్ధంగా లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.లెక్కింపు ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను లేదా ఇతర రాష్ట్రాల సిబ్బందిని వినియోగించుకోవాలనే ఎన్నికల సంఘం నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు తేల్చి చెప్పింది.
ఎన్నికల లెక్కింపులో స్థానిక సిబ్బందికి బదులుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించడంపై టీఎంసీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనివల్ల నిష్పాక్షికత దెబ్బతింటుందని వాదించింది.అయితే, ఓట్ల లెక్కింపు పారదర్శకంగా, ఎటువంటి పక్షపాతం లేకుండా జరగడమే తమ ప్రాధాన్యత అని, అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తన వాదనను వినిపించింది.
Also Read:ఆర్‌అండ్‌బీ టెండర్లలో అవినీతి:హరీష్
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సమయంలో హింసాత్మక సంఘటనలు జరిగిన నేపథ్యంలో, ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత భద్రత మధ్య మరియు నిష్పాక్షికంగా నిర్వహించాలని ఎన్నికల సంఘం భావించింది. ఈ క్రమంలోనే లెక్కింపు సిబ్బంది నియామకంలో ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో ఈ ప్రక్రియకు అడ్డంకులు తొలగిపోయాయి.

