కన్నడ సినీ రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో రోజుకో సంచలన నిజం బయటపడుతోంది. ఈ నృశంసమైన హత్యకు సంబంధించిన దర్యాప్తులో ఛార్జ్‌షీట్ వివరాలు, ప్రధాన నిందితుల అనుచరుడు ఇచ్చిన వాంగ్మూలం కన్నడనాట తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ కేసులో A-14 నిందితుడిగా ఉన్న దర్శన్ అనుచరుడు ప్రదోష్ అప్రూవర్‌గా మారి విచారణాధికారులకు ఇచ్చిన వాంగ్మూలం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అతడు వెల్లడించిన కథనం ప్రకారం, హత్య జరిగిన రోజు రేణుకాస్వామిపై అత్యంత అమానుషంగా దాడి చేశారు.
నటి పవిత్ర గౌడకు సోషల్ మీడియాలో మెసేజ్‌లు పంపాడనే ఆగ్రహంతో రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి దారుణంగా హింసించారు. రేణుకాస్వామిని బూతులతో దూషిస్తూ, తల నుంచి రక్తం వచ్చేలా హీరో దర్శన్ దాడికి పాల్పడ్డారు. అనంతరం దర్శన్ పిలుపుతో ఘటనా స్థలానికి వచ్చిన పవిత్ర గౌడ, కిందపడి ఉన్న రేణుకాస్వామిని చెప్పుతో కొట్టినట్లు ప్రదోష్ వెల్లడించారు.
దాడి అంతటితో ఆగలేదు. రేణుకాస్వామిని కేవలం లోదుస్తులపై (అండర్‌వేర్ మీద) ఉంచి, టాటా ఏస్ వాహనానికి వేలాడదీసి నైలాన్ తాడుతో విచక్షణా రహితంగా బాదారు. కొంత సమయం తర్వాత అతనికి అన్నం, నీళ్లు అందించినప్పటికీ, దర్శన్ ఏమాత్రం కనికరం లేకుండా అతని ఛాతీ, మెడపై కాలితో గట్టిగా తన్నారు. ఆ తీవ్రమైన దెబ్బలకు రేణుకాస్వామి స్పృహతప్పి పడిపోయాడు.
అయినప్పటికీ శాంతించని దర్శన్, స్పృహతప్పి పడి ఉన్న రేణుకాస్వామి ఛాతీపై నిలబడి తొక్కేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో తాను దర్శన్‌ను పక్కకు లాగి.. పరీక్షించగా రేణుకాస్వామి అప్పటికే మరణించినట్లు గుర్తించానని ప్రదోష్ విచారణలో తెలిపాడు. ఈ దారుణం జరిగిన తర్వాత దర్శన్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడని…ఈ హత్య విషయాన్ని ఎలాగైనా సెటిల్ చేయకపోతే గన్‌తో కాల్చుకొని చనిపోతాను అని దర్శన్ అన్నాడని ప్రదోష్ తెలిపాడు. ఆ భయంతోనే పోలీసులను, చట్టాన్ని తప్పుదోవ పట్టించడానికి అనేక కట్టుకథలను అల్లి, వేరే వారిని లోబరుచుకునేందుకు చర్చలు జరిపినట్లు వెల్లడించాడు.
Also Read:పెద్ది యాదిలో… కేసీఆర్ కంట కన్నీరు
కేసుకు సంబంధించిన అన్ని వివరాలను చట్టానికి అందించినందున, తన ప్రాణాలకు ముప్పు ఉందనే ఆందోళనను ప్రదోష్ వ్యక్తం చేశాడు. తన రక్షణను దృష్టిలో ఉంచుకుని దర్శన్ మరియు ఇతర నిందితులతో కలిపి కాకుండా, తానొక్కడినే ప్రత్యేక సెల్‌లో ఉంచాలని కోర్టును పిటిషన్ ద్వారా అభ్యర్థించాడు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు త్వరలోనే తన తుది తీర్పును వెల్లడించనుంది.

