టాలీవుడ్ మరో గొప్ప నిర్మాతను కొల్పొయింది. ప్రముఖ నిర్మాత కళామతల్లి ముద్దుబిడ్డ రాఘవ ఈరోజు ఉదయం మరణించిన విషయం తెలిసిందే. నిర్మాత రాఘవ భౌతికకాయానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళుర్పించారు. ఈసందర్భంగా కె.రాఘవతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు నటుడు, దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి. నేను మొదట ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నన్ను ఆదరించింది రాఘవ గారే అని చెప్పారు.
రాఘవగారు చాలామంది ప్రముఖులను ఇండస్ట్రీకి పరిచయం చేసారని చెప్పారు. ఎటువంటి అండదండలు లేకుండా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఎన్నో విజయాలు సాధించారన్నారు. మూకీ సినిమా నుంచి డిజిటల్ యుగం వరకూ సినీ పరిశ్రమలో అన్ని రకాల మార్పులు చూసిన మహానుభావుడన్నారు. చిత్ర పరిశ్రమ రాఘవగారిని గౌరవించి అంత్యక్రియలు జరపాలని కోరారు. ఆయనకు వందేళ్లు వచ్చినా కేబీఆర్ పార్క్ లో మాతో పాటు వాకింగ్ చేసేవారన్నారు. రాఘవ భౌతికకాయాన్ని పరామర్శించిన వారిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, నిర్మాత ఆదిశేషగిరి రావు, నటుడు సుమన్, వైఎస్‌ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతిలు ఉన్నారు.