మన చరిత్రను భద్రపర్చుకోవాలని, దానిని భావితరాలకు అందించాలని ఇందుకోసం రికార్డులను పదిలపర్చాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిటీ 62వ జాతీయ సదస్సును మంగళవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రారంభించారు. రికార్డులు లేకుండా చరిత్ర లేదని, ఇంతటి ముఖ్యమైన రికార్డులను డిజిటలైజ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రాచ్య లిఖిత సంస్థ( ఆర్కైవ్స్) ప్రపంచంలోని పది ప్రాచ్య లిఖిత సంస్థల్లో ఒకటి కావడం గర్వకారణమన్ను.
మన ప్రాచ్య లిఖిత సంస్థలో దాదాపు వివిధ రాజవంశాలకు చెందిన 15వేల రికార్డులు ఉండడం విశేషమన్నారు. ఇంతటి విలువైన రికార్డులున్న తెలంగాణ ప్రాచ్య లిఖిత సంస్థను పూర్తిగా డిజిటలైజ్ చేయాలన్నారు. హైదరాబాద్ ఐటి కేంద్రంగా ఉందని, ఇలాంటి ఐటి కేంద్రంలో చరిత్రకు సంబంధించిన రికార్డులు డిజిటలైజ్ చేయకపోతే బాగుండదన్నారు. వెంటనే కేంద్ర ప్రాచ్య లిఖిత సంస్థ అధికారులు తెలంగాణ ఆర్కైవ్స్ లోని రికార్డులన్ని డిజిటలైజ్ చేసేందుకు చర్యలు చేపట్టాలని, ఇందుకయ్యే ఖర్చుకు వెనుకాడాల్సిన పనిలేదని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఖర్చు భరిస్తుందని హామీ ఇచ్చారు.
హైదరాబాద్ ఒక చారిత్రక నగరమని, ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిటీ 62వ జాతీయ సదస్సు ఇక్కడ జరగడమే సరైందని ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. అదేవిధంగా ఇంతటి చారిత్రక నగరం దేశంలోనే అత్యంత పిన్న వయస్సున్న తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందని చమత్కరించారు. హైదరాబాద్ నగరం బిర్యానికి ప్రసిద్ది అని దేశవ్యాప్తంగా ఉన్న చరిత్ర కారులు ఈ సదస్సుకు వచ్చారని, వీరంతా హైదరాబాద్ బిర్యాని రుచి చూసి, ఇక్కడి ఆతిధ్యాన్ని స్వీకరించాలని కోరారు. ఈ సమావేశంలో మొఘల్ రికార్డ్స్ కేటలాగ్ 116, పార్ట్ 2, ఇతిహాస్ వ్యాల్యూమ్ 2ను ఉఫ ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఆర్కైవ్స్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏకే గోయల్, కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి రాఘవేంద్ర సింగ్, నేషనల్ ఆర్కైవ్స్ డైరెక్టర్ జనరల్ ప్రీతం సింగ్, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ బి.పి ఆచార్య, రాష్ట్ర ఆర్కైవ్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆకునూరి మురళి, రాష్ట్ర ఆర్కైవ్స్ డైరెక్టర్ జరీనా పర్వీన్, ఇతర అధికారులు, చరిత్రకారులు పాల్గొన్నారు.