సింగరేణి ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు తానే స్వయంగా మొక్కలు నాటుతూ అందరిలోనూ స్ఫూర్తిని నింపుతున్న డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్) శ్రీ ఎన్. బలరామ్ మరో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటి వరకు పండ్ల మొక్కలు, ఔషధ మొక్కలు నాటుతూ ఒంటరిగా 12 వేలకు పైగా మొక్కలు నాటి హరిత హారం మహా యజ్ఞంలో తనవంతు పాత్రను పోషించిన ఆయన.. మంగళవారం కొత్తగూడెంలోని బంగ్లాస్ ఏరియాలో గులాబీ వనానికి(రోజ్ గార్డెన్) కు శ్రీకారం చుట్టారు. ఒక్కడే 205 గులాబీ మొక్కలను 40 నిమిషాల వ్యవధిలో నాటి అందరినీ మళ్లీ ఆశ్చర్యపరిచారు.
సింగరేణి ప్రాంతంలో కొత్తగూడెం బంగ్లాస్ కు విశిష్టమైన స్థానం ఉంది. ఎందరో ప్రముఖులు ఈ ఇక్కడికి విచ్చేశారు. అయితే ఈ ప్రాంతంలో అందమైన పూల వనాన్ని ఏర్పాటు చేయాలని డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్) శ్రీ ఎన్.బలరామ్ భావించారు. ఇందులో భాగంగా పువ్వులన్నింటిలోనూ ప్రత్యేకమైనదిగా భావించే గులాబీ తోట(రోజ్ గార్డెన్) ను బంగ్లాస్ ఏరియాలో మొదలు పెట్టాలని ఫారెస్టు విభాగం అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు 205 గులాబీ మొక్కలను సింగరేణి నర్సరీ నుంచి తీసుకురాగా.. డైరెక్టర్ వాటిని బంగ్లాస్ ఏరియా ప్రాంతంలో నాటారు. ఈ మొక్కలతో ఈ ప్రాంతం పూతోటగా మారుతుందని, అందమైన శోభ వస్తుందని ఆయన ఆకాంక్షించారు.
సింగరేణి సంచాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి సారిగా జూన్ 5, 2019న బంగ్లాస్ ఏరియాలో తాను 108 మొక్కలు నాటిన విషయాన్ని డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్) శ్రీ ఎన్.బలరామ్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. సింగరేణి లో ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని, తెలంగాణ లో పచ్చదనాన్ని పెంపొందించాలన్న ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖరరావు ఆకాంక్షలను నెరవేర్చాలన్నారు. అలాగే సింగరేణి ఛైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్.శ్రీధర్ ఆదేశాల మేరకు హరిత హారంలో ఇప్పటికే 5 కోట్లకు పైగా మొక్కలు నాటామని తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్టు శ్రీ భీమ్లా నాయక్, ఏజీఎం(ఫారెస్ట్రీ) శ్రీ వివేక్ బాబు, డీజీఎం (ఫారెస్ట్రీ) శ్రీ హరి నారాయణ, ఫారెస్టు ఆఫీసర్ శ్రీ కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీరాంపూర్ లోని ఉపరితల గని మట్టి కుప్పపై 2019 జులై 20వ తేదీన జరిగిన మెగా హరిత హారంలో డైరెక్టర్ శ్రీ బలరామ్ పాల్గొన్నారు. 1237 మొక్కలను గంట వ్యవధిలో నాటి అందరూ ఆశ్చర్యపడేలా చేశారు. అదే రోజూ జైపూర్ ఎస్టీపీపీలో జరిగిన హరిత హారంలో 501 మొక్కలు నాటారు. ఇలా ఒకే రోజూ ఆయన 1700 పైగా మొక్కలు నాటడం విశేషం. గత ఏడాది జూలై 24 న రామగుండం లో నిర్వహించిన ముక్కోటి వృక్షార్చన లో మొక్కను నాటడం ద్వారా 12 వేల మొక్కను నాటి మరో మైలు రాయిని చేరుకున్నారు. తాజాగా నాటిన 205 మొక్కలను కలుపుకొని ఇప్పటి వరకు 12,809 మొక్కలు ఆయన స్వయంగా నాటారు. జపాన్ లో ప్రాచుర్యం పొందిన మియావాకీ పద్ధతిలో మొక్కల పెంపకాన్ని డైరెక్టర్ శ్రీ బలరామ్ ప్రయోగాత్మకంగా ఇల్లందు, భూపాలపల్లి ఏరియాలో ప్రారంభించారు. ఆయన నాటిన మొక్కలు చిన్నపాటి వనాన్ని తలపించేలా పెరగడం విశేషం.
అందరిలోనూ పర్యావరణ స్పృహను కల్పించేందుకు కృషి చేస్తున్న డైరెక్టర్ శ్రీ బలరామ్ సేవలను గుర్తిస్తూ గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ వారు గ్రామోదయ బంధు మిత్ర పురస్కారంతో సత్కరించారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ సారథ్యంలోని గ్రీన్ ఛాలెంజ్ సంస్థ ఆయనకు వన మిత్ర పురస్కారాన్ని అందజేసింది. సమాజ అభ్యున్నతికి నిస్వార్థంగా సేవలు అందించే వ్యక్తులకు ప్రముఖ ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ ప్రకటించే ప్రతిష్టాత్మక అవర్ నైబర్హుడ్ హీరో పురస్కారం కూడా డైరెక్టర్ శ్రీ బలరామ్ ను వరించడం విశేషం.