భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)పూ సుప్రీం కొరడా ఝుళిపించింది. లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయాలన్న తమ ఆదేశాలను పాటించకుండా మొండిగా వ్యవహరిస్తున్న బీసీసీఐ చీఫ్ అనురాగ్ ఠాకూర్,ప్రధాన కార్యదర్శి అజయ్ షిర్కేలను పదవుల నుంచి తొలగించి షాకిచ్చింది. లోథా కమిటీ సిఫారసులను అమలు చేయాలని నొక్కి వక్కాణించింది. వీరిద్దరూ ఈ పదవుల్లో కొనసాగడానికి అర్హులు కాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
త్వరలోనే ఈ పదవులను కొత్తవారితో సుప్రీంకోర్టు భర్తీ చేయనుంది. 70 సంవత్సరాలు పైబడిన ఆఫీస్ బేరర్లను కూడా తొలగించాలని ఆదేశించింది. ఒకే పదవిలో తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్నా కూడా వేటు వేయాలని తీర్పువెలువరించింది. ఇక తొలగించిన వారి స్థానంలో కొత్తవారిని నియమించేందుకు, లోథా కమిటీ సిఫారసులను అమలు చేయడానికి సుప్రీంకోర్టు ఓ పానెల్ ను ఏర్పాటు చేసింది. తదుపరి విచారణను జనవరి 19కి వాయిదా వేసింది. బోర్డు సభ్యులుగా ఎవరుండాలో జనవరి 19న ప్రకటిస్తామని కోర్టు స్పష్టం చేసింది.
బీసీసీఐను ప్రక్షాళన చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై జస్టిస్ ఆర్.ఎమ్ లోధా హర్షం వ్యక్తం చేశారు. కమిటీ సూచించిన సూచనలను 2016 జూలై 18న సుప్రీంకోర్టు ఆమోదించినప్పుడే అవి అమల్లోకి వచ్చాయని పేర్కొన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం రికమెండేషన్స్‌ను ఆమోదం తెలిపినప్పుడే అందరూ కమిటీ సూచనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన గుర్తుచేశారు.ఇందులో మరోమాటకు తావులేదన్నారు.
దేశంలో క్రికెట్ ప్రక్షాళనకు చేపట్టాల్సిన సంస్కరణలతో కూడిన నివేదికను లోధా కమిటీ 2016, జులై 18న సుప్రీంకోర్టుకు సమర్పించింది.70 ఏళ్లు పైబడిన వారు, రాజకీయ నేతలు క్రికెట్ సంఘాల్లో ఎలాంటి పదవులు చేపట్టారని కమిటీ సూచించింది. అయితే ఈ సూచనలను అమలు చేసేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఈ క్రమంలోనే నిబంధనలకు విరుద్ధంగా అజయ్ షిర్కేను ప్రధాన కార్యదర్శిగా నియమించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు గతంలోనే బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు జైలుకు వెళ్లాల్సి వస్తుందని గత విచారణ సందర్భంగా కోర్టు అనురాగ్ ఠాకూర్‌ను హెచ్చరించింది. ఈ క్రమంలోనే ఈరోజు దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు బీసీసీఐ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శిలపై వేటు వేసి గట్టిషాకిచ్చింది.