అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్ దోషిగా తేలగా తాజాగా ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూజీ పేరు తెరమీదకు వచ్చింది. అత్యాచారం కేసులో అరెస్టై జైలు శిక్ష అనుభవిస్తున్న ఆశారం బాపుజీపై చర్యలేవని ప్రశ్నించింది సుప్రీం కోర్టు. ఆశారంపై చర్యలకు ఎందుకు వెనుకాడుతున్నారని గుజరాత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అత్యున్నత న్యాయస్ధానం …దీనిపై వివరణతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
నిందితుడిని విచారించేందకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించిన న్యాయస్ధానం దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. తదుపరి విచారణను దీపావళి తర్వాత చేస్తామని తెలిపింది. ఆశారామ్ బాపూ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ 16 ఏళ్ల బాలిక ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఆశ్రమంలో ఆశారామ్ తనపై ఈ దాష్టీకానికి పాల్పడ్డారని ఆరోపించింది. లైంగిక దాడి జరిగినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ కావడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆశారామ్‌పై ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అప్పటినుంచి పలుమార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా… న్యాయస్ధానం తిరస్కరిస్తూ వచ్చింది. చివరగా ఈ ఏడాది జనవరిలో ఆశారాం పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను సుప్రీం తిరస్కరించింది. తనకు ఆరోగ్యం బాగోలేదని.. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కొన్ని మెడికల్ సర్టిఫికెట్స్‌ను కోర్టుకు సమర్పించారు. అవి నకిలీవని గుర్తించిన న్యాయస్థానం.. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆశారం బాపూకు రూ. లక్ష జరిమానా విధించిన కోర్టు… ఆయనపై మరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడ్డరన్న ఆరోపణలతో.. 2013 సెప్టెంబర్ 2 నుంచి ఆయన జైలులో ఉన్నారు.
ఆశారామ్ బాపూపై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో 2009లో ఆయనపై హత్యాయత్నం, భూకబ్జా కేసులు నమోదవగా మధ్యప్రదేశ్‌లోనూ భూకబ్జా కేసు నమోదైంది. పాదాభివందనం చేసేందుకు వచ్చిన ఓ భక్తుడిని ఆశారామ్ దుర్భాషలాడుతూ కాలితో తన్నారు. 2012లో ఓ వీడియో జర్నలిస్టు చెంప చెళ్లుమనిపించారు. 2008లో గుజరాత్‌లో ఆశారామ్‌కు చెందిన ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటున్న ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. 2013లో ఆయనను అరెస్టుచేసే క్రమంలో ఆశారాం అనుచరులు పోలీసులు, మీడియాపైనా దాడికి పాల్పడ్డారు.