రాష్ట్ర ప్రజలకు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నిర్వచనానికి అందని వ్యక్తిత్వం. వేలకోట్ల భావాలకు ప్రతిరూపం. జీవాన్ని, జీవితాన్ని ఇవ్వడమే కాదు..జీవిత కాలపు ప్రేమను, మమకారాన్ని పంచడంలో తల్లిని మించి ఎవరూ ఉండరు. అలాంటి మాతృ మూర్తిని గొప్పగా ఆరాధించే ఈ రోజు అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం మహిళా పక్షపాతిగా పనిచేస్తుందన్నారు. మహిళల రక్షణ, సమగ్ర వికాసం, సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తూ వారికి అడుగడుగునా అండగా నిలుస్తుందని మంత్రి తెలిపారు.
ఆడపిల్ల అమ్మ గర్భంలో పడినప్పటి నుంచి ఆమె యుక్త వయసుకు వచ్చి పెళ్లి చేసుకుని, మళ్లీ తల్లి అయ్యే వరకు ప్రతి సమయంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఆరోగ్యకరమైన శిశువుకు జన్మనివ్వడానికి గర్భం దాల్చిన ఆరు నెలల నుంచి ప్రసవం అయిన మూడు నెలల వరకు మూడు దఫాలుగా 12వేల రూపాయలు, ఆడపిల్ల పుడితే అదనంగా 1000 రూపాయలు ఇచ్చి మహిళలకు, ఆడపిల్లకు ఈ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తుందన్నారు.
గర్భిణిని ప్రభుత్వ దవాఖానకు జాగ్రత్తగా తీసుకెళ్లి, ప్రసవం అనంతరం తల్లీ- బిడ్డలను క్షేమంగా ఇంటికి ఉచితంగా చేర్చే అమ్మ ఒడి పథకం, ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవం అయితే తల్లీ- బిడ్డలకు అవసరమైన సబ్బులు, షాంపూ లు, పౌడర్, నూనె, బట్టలు, దోమతెరలు, పరుపు వంటి అనేక సామాన్లతో కేసీఆర్ కిట్ ఇస్తున్నాం. ఆ తర్వాత ఆడపిల్లల విద్య కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా 53 ప్రత్యేక రెసిడెన్షియల్ విద్యాలయాలు పెట్టి వారి ఉన్నత విద్యకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.