తమిళనాడు సీఎంగా శశికళ….!

316
- Advertisement -

తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి తర్వాత తమిళనాడులో అధికార పార్టీ రాజకీయాలు రోజురోజుకి ఆసక్తికరంగా మారుతున్నాయి.

తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై శశికళను కూర్చోబెట్టేందుకు రంగం సిద్దమవుతుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలుగా ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టిన శశికళను… సీఎంగానూ బాధ్యతలు చేపట్టాలంటూ కొందరు పార్టీ నేతలు ఆమెను కలిశారు.

Sasikala To Become Tamil Nadu Chief Minister

ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా, ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శిగా రెండు బాధ్యతలు జయలలిత నిర్వహించేవారు….జయ అంతిమ క్రియలను దగ్గరుండి చూసుకున్న శశికళను ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. సీఎం పన్నీర్ సెల్వం, లోక్‌సభ డిప్యూట స్పీకర్ తంబిదురై సహా పార్టీ సీనియర్ నేతలంతా కలసి ఆమెకు ఈ బాధ్యతలను కట్టబెట్టారు.

ప్రస్తుతం ముఖ్యమంత్రి పీఠం కోసం కూడా అన్నాడీఎంకేలోని ఓ వర్గం పావులు కదుపుతోంది. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్‌కే నగర్ ఉపఎన్నికలోనూ ఆమెను పోటీ చేయించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు అన్నాడీఎంకే అనుబంధ సంస్థ జయలలిత పెరవై ఆదివారం ఓ తీర్మానం చేసింది. ‘తాయి తంట వరం’ అంటే అమ్మ ఇచ్చిన వరమే చిన్నమ్మ అనే శీర్షికతో ఉన్న ఈ తీర్మానం కాపీని… తమిళనాడు రెవెన్యూ మంత్రి, పెరవై కార్యదర్శి ఉదయ్ కుమార్ శశికళకు అందజేశారు.

Sasikala To Become Tamil Nadu Chief Minister

ఉదయ్ కుమార్‌తో పాటు మరో ఇద్దరు మంత్రులు దాదాపు 50 మంది నేతలు పోయెస్ గార్డెన్స్‌కు వెళ్లి శశికళను కలుసుకున్నారు. ఏఐఏడీఎంకే పార్టీకి నాయకత్వం వహించడంతో పాటు ఆర్కే నగర్‌లో ‘చిన్నమ్మ’ పోటీ చేయాలనీ… ముఖ్యమంత్రిగానూ బాధ్యతలు స్వీకరించి ‘అమ్మ’ ప్రభుత్వాన్ని నడిపించాలని కోరుకుంటున్నట్టు ఉదయ్‌కుమార్ వెల్లడించారు.

ఇంతవరకు అన్నాడీఎంకేలోని ఏ ఒక్కరూ శశికళను బహిరంగంగా వ్యతిరేకించలేదు. ఇదంతా చూస్తుంటే రాబోయే రోజుల్లో చిన్నమ్మ ముఖ్యమంత్రి కావడం ఖాయంగానే కనిపిస్తోంది.

- Advertisement -