తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి తర్వాత తమిళనాడులో అధికార పార్టీ రాజకీయాలు రోజురోజుకి ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రస్తుతం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన శశికళ…తాజాగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునేందుకు ముహుర్తం ఖరారైనట్టు ఆపార్టీ వర్గాల సమాచారం. ఈ నెల 8 లేదా 9వ తేదిన శశికళను ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు ఆపార్టీ నేతలు చెబుతున్నారు.
ఆదివారం జరిగే ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నట్టు పార్టీ ప్రకటించింది. దీంతో అందరి దృష్టి ఆ సమావేశంపైనే కేంద్రీకృతమైంది. మరోవైపు శశికళకు అత్యంత విధేయురాలైన అధికారి షీలా బాలకృష్ణన్‌తో సహా ముగ్గురు ఉన్నతాధికారులను రాజీనామా చేయాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వం కోరినట్టు చెబుతున్నారు. జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పడు పాలనా బాధ్యతలన్నీ షీలానే చూసుకున్నారు.
శుక్రవారం రాత్రి ఆమెను రాజీనామా చేయాలని పన్నీర్ సెల్వం కార్యాలయం కోరినట్టు చెబుతున్నారు. శుక్రవారం మాజీ మంత్రి కేఏ సెంగోట్టాయన్, మాజీ మేయర్ సైదాయ్ ఎస్ దురైసామిలను పార్టీ కార్యదర్శులుగా శశికళ నియమించారు. పార్టీలోని అసమ్మతి వాదులకు చెక్ పెట్టేందుకే వీరిని తెరపైకి తీసుకువచ్చినట్టు కనిపిస్తోంది. మరోవైపు ఏఐఏడీఎంకే పార్టీ అనుబంధ సంస్థ ఎంజీఆర్ యూత్ వింగ్ సెక్రటరీగా ఉన్న అంబత్తూర్ ఎమ్మెల్యే అలెగ్జాండర్‌ను కూడా తొలగిస్తున్నట్టు శశికళ ప్రకటించారు.
అదేవిధంగా దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని అపోలో చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి అన్నారు. విచారణ జరిపితేగనుక, జయ మరణానికి సంబంధించిన అన్నివివరాలను అందజేస్తామని ఆయన అన్నారు. తాను మొదటి నుంచి చెపుతున్నట్లే.. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత గుండెపోటుకు గురికావడం వల్లే జయ చనిపోయారని మరోసారి స్పష్టంచేశారు. చికిత్సలో భాగంగా జయలలిత కాళ్లు తొలిగించారనే వార్తలు ఏలాంటి వాస్తవాలు లేవని ప్రతాప్.సి.రెడ్డి పేర్కొన్నారు.