కాంగ్రెస్ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేసే అధికారం ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియాలకు లేదన్నారు మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ. తనపై చర్యలు తీసుకోవాలంటే కాంగ్రెస్ అధిష్టానం మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేశారు. సర్వే సత్యనారయణ ఇటివలే కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్, ఎఐసిసి కార్యదర్శి కుంతియాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అందుకు సర్వేను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటి.
ఈసందర్భంగా తనను సస్పెండ్ చేయడంతో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్న వాళ్లే నేడు గాంధీభవన్ లో కూర్చోని సమీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను దళిత సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని అయినప్పటికీ జనరల్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందానని చెప్పారు. ఎన్నికల ఖర్చు కోసం పార్టీ హైకమాండ్ ఇచ్చిన నిధులు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు సర్వే సత్యనారాయణ. తనతో పాటు కొంత మంది నేతలను ఓడించేందుకు సొంత పార్టీ నేతలే కుట్రలు చేశారని ఆరోపించారు.