ఘనంగా సంతోషం సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ 2019

363
santhosham 2
- Advertisement -

సంతోషం సినీ వారపత్రిక 17వ వార్షికోత్సవం, సంతోషం సౌత్‌ ఇండియా ఫిల్మ్‌ అవార్డ్స్‌ 2019 ప్రదానోత్సవం చిత్రసీమ అతిరథ మహారథుల సమక్షంలో, వేలాది మంది ప్రేక్షకుల మధ్య అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా జరిగింది. హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆదివారం సాయంత్రం నిర్విరామంగా 6 గంటకు పైగా సాగిన ఈ వేడుకలో తారల ప్రసంగాలు, డాన్స్‌ పర్ఫార్మెన్స్‌లు, సరదా స్కిట్‌లు హైలైట్‌గా నిలిచాయి.

ప్రముఖ ఫిల్మ్‌ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి సీనియర్‌ హాస్యనటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్‌ చేతుల మీదుగా ఫిల్మ్‌ జర్నలిజంలో లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్నారు. పదిహేడు సంవత్సరాలుగా నిరాటంకంగా ఈ వేడుకను ఒంటిచేత్తో నిర్వహించడం సురేష్‌ కొండేటికే సాధ్యమని బాబూ మోహన్‌ ప్రశంసించారు.

‘మహానటి’లో నటనకు గాను ఉత్తమ సపోర్టింగ్‌ ఆర్టిస్టు అవార్డును జమున చేతుల మీదుగా అందుకున్న డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘‘మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావుగారు నా సినిమాలు చూసి ఆనందించేవారని చెప్పారు. అందుకు అదృష్టంగా భావిస్తున్నా. ఈ అవార్డు రావడానికి కారకులు ఆ పాత్రను సృష్టించిన రచయితలు, దర్శకులు. వాళ్లిచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగపర్చుకున్నాను. నేను మీరు ఫీలయినంతకాలం పనిచేస్తూనే వుంటాను. అల్లు అరవింద్‌ వంటి సీనియర్‌ నిర్మాతలు మంచి సినిమాలు తీసి అవకాశాలు ఇవ్వడం వల్ల ఇలాంటి అవార్డులు దక్కుతాయి. ఏ కళాకారుకారుడికైనా ఈ అవార్డులు ఉత్సాహాన్నిస్తాయి’’ అన్నారు.

‘మహానటి’ చిత్రంలో చిన్నప్పటి సావిత్రిగా నటించిన సాయి తేజస్వినికి జమున బెస్ట్‌ చైల్డ్‌ ఆర్టిస్టు అవార్డు అందజేశారు. సాయి తేజస్విని మాట్లాడుతూ.. ‘‘వెరీ హ్యాపీ.. నాకీ అవార్డు ఇచ్చిన సురేష్‌ అంకుల్‌కు థ్యాంక్స్‌. ‘మహానటి’ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ గారికీ, ప్రొడ్యూసర్‌ స్వప్నా దత్‌ గారికీ థ్యాంక్స్‌’’ అన్నారు.

65 సంవత్సరాల సినీ జీవితం పూర్తయిన సందర్భంగా విఖ్యాత నటి జమున నిర్మాతలు అల్లు అరవింద్‌, డి. సురేశ్‌ బాబు చేతుల మీదుగా ప్రత్యేక పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ‘‘జమునగారు నటించిన తొలి సినిమా ‘పుట్టిల్లు’లో మా నాన్నగారు (అల్లు రామలింగయ్య) కూడా నటించారు. మద్రాస్‌లో మేముండే వీధిలోనే ఆమె కూడా ఉండేవారు. ఇప్పుడు ఆమెకు నేను అవార్డు ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు.

santhosham Awards
సురేశ్‌బాబు మాట్లాడుతూ ‘‘మా నాన్నగారు సోలోగా నిర్మించిన మొదటి సినిమా ‘రాముడు భీముడు’లో జమున గారు హీరోయిన్‌గా నటించారు. నా చిన్నతనంలో మేము, ఆమె ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉండేవాళ్లం. నా చేతుల మీదుగా ఆమెకు అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉంది’’ అని చెప్పారు.

జమున మాట్లాడుతూ ‘‘అరవింద్‌, సురేశ్‌బాబు నా బిడ్డల్లాంటి వాళ్లు.. సినిమా పరిశ్రమ గర్వించదగ్గ నిర్మాతలుగా ఉండడం ఆనందదాయకం. సురేష్‌ కొండేటి ఈ అవార్డును అందజేయడం ఎంతో సంతోషంగా ఉంది’’ అన్నారు.

అల్లు రామలింగయ్య అవార్డును అల్లు అరవింద్‌ చేతుల మీదుగా అందుకున్న వెన్నెల కిశోర్‌ మాట్లాడుతూ ‘‘మామూలుగా ఒక అవార్డు తీసుకెళ్లినప్పుడు.. నా పేరు చూసి హ్యాపీగా ఫీలయ్వేవాడిని. కానీ ఈ అవార్డుపై అల్లు రామలింగయ్యగారి పేరు చూసి ఇంట్లో గర్వంగా ఫీలవుతారు. ఈ అవార్డును నా రచయితలకు, దర్శకులకు అంకితమిస్తున్నా. నేను ఈ జన్మకు హీరోగా చేయను. హీరో ఫ్రెండ్‌గా చాలు. హీరో అవ్వాలంటే దానికి అర్హత కావాలి. ఆ క్వాలిఫికేషన్‌ లేదు. బాడీ ఔటాఫ్‌.. ఫుడ్‌ త్యాగం చేయలేను’’ అని నవ్వించారు.

డి. రామానాయుడు స్మారక అవార్డును సురేశ్‌బాబు చేతుల మీదుగా అందుకున్న దిల్‌ రాజు ‘‘ఒక జర్నలిస్ట్‌గా మొదలై.. ఇంతమందికి అవార్డు ఇచ్చే స్థాయికి ఎదిగిన సురేష్‌కు అభినందనలు. ఇది మామూలు ఫీలింగ్‌ కాదు.. ‘శతమానంభవతి’కి జాతీయ అవార్డు వచ్చినప్పుడు ఎలా ఫీలయ్యానో.. ఈ అవార్డుకు కూడా అలా ఫీలవుతున్నా. రామానాయుడుగారి సినిమాలు నాకు గ్రేట్‌ ఇన్‌స్పిరేషన్‌. ఆయన అవార్డు సురేశ్‌ బాబుగారి చేతుల మీదుగా తీసుకోవడం సంతోషంగా ఉంది’’ అన్నారు.

‘అరవింద సమేత’లో నటనకు గాను నిర్మాత అంబికా కృష్ణ చేతుల మీదుగా ఉత్తమ హాస్యనటునిగా పురస్కారం అందుకున్న సునీల్‌ మాట్లాడుతూ.. ‘‘సంతోషం సురేష్‌కి థాంక్స్‌. ఈ అవార్డు వచ్చినందుకు నిర్మాణ సంస్థ హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌కు, డైరెక్టర్‌ త్రివిక్రమ్‌కు, ఎన్టీయార్‌కు ధన్యవాదాలు. ఈ అవార్డును వేణుమాధవ్‌ గారికి అంకితమిస్తున్నా’’ అని చెప్పారు.

‘ఆర్‌ఎక్స్‌ 100’లో నటనకు గాను బెస్ట్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అవార్డు అందుకున్న రాంకీ మాట్లాడుతూ ‘‘ఒక చక్కని పాత్రతో తెలుగులో ఈ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. చిత్రసీమకు చెందిన ఇంతమంది గొప్పవాళ్ల సమక్షంలో ‘సంతోషం’ అవార్డును అందుకోవడం ఎప్పటికీ మరచిపోలేను’’ అన్నారు.

అంబికా కృష్ణ చేతుల మీదుగా ఆత్మీయ పురస్కారం అందుకున్న ఎస్వీబీసీ చైర్మన్‌ పృథ్వీ రాజ్‌ మాట్లాడుతూ.. అవార్డు వేడుక ఒక సంవత్సరం చేయాలంటేనే చాలా కష్టం, అలాంటిది 17 సంవత్సరాలు చేశారంటే.. కష్టానికి ప్రతిరూపం ఎవరంటే సురేష్‌. ఆయన కష్టానికి ఇష్టుడు. అందరూ ప్రేమించే వ్యక్తి. అందుకే మెగాస్టార్‌ ఫ్యామిలీకి చాలా దగ్గరయ్యాడు. నేను సురేష్‌ కోసమే ఇక్కడకు వచ్చాను. ఆయన మరో వందేళ్లు అలాగే సంతోషంగా ఉండాలి’’ అన్నారు.

- Advertisement -