రికార్డులు బ్రేక్ చేస్తున్న సంక్రాంతి మొనగాళ్లు

98
Sankranti Superheroes of Tollywood

సంక్రాంతి పేరు చెప్పగానే తెలుగువారికి ముగ్గులు, గొబ్బెమ్మలు, కోడిపందేలు, గాలిపటాలే కాదు తెలుగు సినిమా కూడా గుర్తుకు వస్తుంది. తెలుగు చిత్రరంగానికి సంబంధించినంతవరకూ సంక్రాంతి పెద్ద సీజన్‌. ఇదే తొలి పరీక్ష. సంక్రాంతికి విడుదలైన తమ సినిమా హిట్‌ అయితే ఇక ఆ ఏడాదంతా తమ కెరీర్‌కు ఢోకా లేదని హీరోలు భావిస్తుంటారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సంక్రాంతి ఈ సారి చాలా ప్రత్యేకతను సంతరించుకుంది.

Sankranti Superheroes of Tollywood

9 సంవత్సరాల గ్యాప్‌ తర్వాత చిరంజీవి ఖైదీ నెంబర్ 150గా ముందుకు రాగా…బాలకృష్ణ వందో సినిమాగా గౌతమి పుత్ర శాతకర్ణితో వచ్చేశాడు. ఇక వీరితో సై అంటూ శర్వానంద్ శతమానం భవతితో ముందుకువచ్చాడు. ప్రధానంగా చిరు-బాలయ్య మధ్యే సంక్రాంతి సమరం సాగుతుందని జోరుగా పందేలు కూడా కాశారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ..సంక్రాంతి బరిలో నిలిచిన మూడు సినిమాలు హిట్‌ టాక్‌తో రికార్డు వసూళ్లను రాబడుతున్నాయి.

ముందుగా బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ముందుకువచ్చిన చిరు ఖైదీ నెంబర్ 150 బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. వీకెండ్ కలెక్షన్లు ముగిసే సరికి 106 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి విమర్శకుల నోళ్లు మూయించింది. దాదాపు పదేళ్ల తర్వాత తెరపై చిరు మెరుపులు మెరిపించాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్‌లోనూ ఖైదీ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఈ నెల 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలిరోజే దాదాపు 47 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసి టాలీవుడ్‌లో మైలురాయిగా నిలిచింది.

Sankranti Superheroes of Tollywood

ఇక ఖైదీ నెంబ‌ర్ 150తో పోటీ ప‌డి థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన బాల‌కృష్ణ గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి రికార్డులు తిరగరాస్తోంది. నైజాం, ఆంధ్రా, సీడెడ్‌, ఓవ‌ర్సీస్‌, క‌ర్ణాట‌క ఇలా ఏ ఏరియా చూసుకున్నా బాల‌య్య కేరీర్ వ‌ర‌కు శాత‌క‌ర్ణి తిరుగులేని రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకుంటోంది. ఇక ఓవ‌ర్సీస్‌లో బాల‌య్య సినిమాలు గ‌తంలో ఎప్పుడూ మిలియ‌న్ మార్క్‌ను ట‌చ్ చేయ‌లేదు. శాత‌క‌ర్ణి కేవ‌లం నాలుగు రోజుల‌కే 1.2 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసింది. ఓవ‌రాల్‌గా తొలి నాలుగు రోజుల్లో శాత‌క‌ర్ణి రూ.35 కోట్ల షేర్‌తో పాటు రూ.50 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇది బాల‌య్య కేరీర్‌లోనే తిరుగులేని రికార్డుగా నిలిచింది.

ఈ నెల 14న విడుదలైన శ‌ర్వానంద్ శ‌త‌మానం భ‌వ‌తిని చూడ‌డానికి ప్రేక్షకులు ఎగ‌బ‌డుతున్నారు.తొలి షో నుంచే హిట్ టాక్‌తో ‘శతమానం భవతి’ కూడా మొదటిరోజు మంచి కలెక్షన్స్‌నే రాబట్టింది. శ‌త‌మానం భ‌వ‌తి తొలి రోజు ఏపీ, తెలంగాణ‌లో రూ 3.04 కోట్ల షేర్ రాబ‌ట్టింది. రెండోరోజు సైతం రూ.2.70 కోట్లు సాధించింది. దీంతో పాటు ఓవర్సీస్‌లోనూ శతమానంభవతి సత్తాచాటుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు దాదాపు రూ.9 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాడు.

Sankranti Superheroes of Tollywood

మొత్తంగా ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా సంక్రాంతి సీజన్‌కు తెలుగు సినిమా బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఇద్ద‌రు పెద్ద హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలయ్యతో పాటు శర్వానంద్ శతమానం భవతితో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురుస్తోంది.