స్వచ్ఛ భారత్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన తెలంగాణ రాష్ట్రానికి అవార్డుని కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ శుక్రవారం వర్చువల్ పద్ధతిలో అందచేశారు. గాంధీ జయంతి, స్వచ్ఛ భారత్ దివస్ సందర్భంగా ఈ అవార్డుని తెలంగాణ రాష్ట్రం తరపున రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పారిశుద్ధ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అందుకున్నారు. కమిషనర్ ఎం.రఘునందన్ రావు, స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ ఎస్.దిలీప్ కుమార్, రాష్ట్ర స్వచ్ఛ భారత్ మిషన్ బృందం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేంద్ర మంచి నీరు – పారిశుద్ధ్య శాఖ గత సంవత్సరం మూడు రకాల ప్రచారాలను ప్రారంభించింది.
నవంబర్ 1 నుండి 2020 ఏప్రిల్ 30 వరకు “స్వచ్ఛ సుందర్ సముదాయిక్ షౌచాలయ (ఎస్ఎస్ఎస్ఎస్)” కార్యక్రమం, 15 జూన్ 2020 నుండి 15 సెప్టెంబర్ 2020 వరకు “సముదాయిక్ షౌచాలయ అభియాన్ (ఎస్ఎస్ఎ)” కార్యక్రమం, 2020 ఆగస్టు 8 నుండి ఆగస్టు 15 వరకు కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్మాణానికి, జిల్లాలు, గ్రామాలను సమీకరిస్తూ, దేశంలో చెత్త, వ్యర్థాలను తొలగించేందుకు గందగీ ముక్త్ భారత్ (డిడిడబ్ల్యుఎస్) కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే వరసగా మూడో సారి మొదటి స్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించింది. కాగా, ఈ సారి కరీంనగర్ జిల్లా దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం వర్చువల్ పద్ధతిలో ఈ అవార్డులిచ్చారు. ఆయా అవార్డులను త్వరలోనే రాష్ట్రానికి చేరుస్తారు.
కాగా, వరసగా అవార్డులు దక్కించుకుంటున్న మన రాష్ట్రం తరపున అవార్డులు స్వీకరించిన అధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు. సిఎం కెసిఆర్ రూపొందించి అమలు చేసిన, పల్లె ప్రగతి కార్యక్రమం దిగ్విజయం అయినందునే ఈ అవార్డులు సాధ్యమయ్యాయన్నారు. ఈ అవార్డులు దక్కడానికి మార్గనిర్దేశనం చేస్తున్న రాష్ట్ర సిఎం కెసిఆర్, సహకరిస్తున్న మంత్రి కెటిఆర్ లకు ఆయన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి, జల్ శక్తి మంత్రికి కూడా మంత్రి ఎర్రబెల్లి ధన్యవాదాలు తెలిపారు. ఇదే విషయమై రెండు రోజుల క్రితం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని, ఆయన నిర్వహిస్తున్న శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని సీఎం కెసిఆర్ అభినందించిన విషయం తెలిసిందే.